జగన్‌కు ‘ఈనాడు’ కౌంటర్లు..!

రాష్ట్రంలో మీడియా సంస్థలు గాని, పత్రిక సంస్థలు గాని..రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలకు బాకా ఊదే సొంత మీడియా సంస్థలు ఎక్కువ అయిపోయాయి. అధికార వైసీపీకి సొంత మీడియా సంస్థతో పాటు..అనుకూల మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి…వీటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. అటు టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిని యెల్లో మీడియా అని వైసీపీ విమర్శిస్తుంటుంది.

పైగా ఆ చానల్స్ ఏవో, పత్రికలు ఏవో జగన్‌తో సహ వైసీపీ నేతలు బయటకుచెప్పి మరీ విమర్శలు చేస్తారు. ఇక ఇప్పటివరకు వైసీపీ సొంత మీడియా పేరుని బయటకుచెప్పి విమర్శలు చేసే టీడీపీ..ఈ మధ్య వైసీపీ అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థల పేర్లని బయటకుచెప్పి విమర్శిస్తున్నారు. ఇలా ఎవరికి వారికి అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వైసీపీ అనుకూల మీడియా పని వచ్చి..చంద్రబాబుపై విమర్శలు, జగన్‌కు భజన చేయడం. టీడీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్‌పై విమర్శలు..బాబుకు భజన చేయడం.

అయితే జగన్ పదే పదే టీడీపీ అనుకూల మీడియా అంటూ చెప్పే పేరులో ఈనాడు ముందు వరుసలో ఉంటుంది. ఈ సంస్థపై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే..ఈనాడులో న్యూస్ తప్ప..విశ్లేషణలు తక్కువ ఉంటాయి. అటు టీడీపీ వాళ్ళు మాట్లాడినా..ఇటు వైసీపీ వాళ్ళు మాట్లాడినా సరే..వాటిని ప్రచురిస్తారు. కానీ ప్రత్యేకంగా విశ్లేషణలు మాత్రం పెద్దగా ఎప్పుడు వేయరు. కాకపోతే టీడీపీ వాళ్ళకు కవరేజ్ ఎక్కువ ఉండేది.

ఇక ఇటీవల మాత్రం ఈనాడు..పూర్తిగా జగన్‌కు కౌంటర్లు ఇస్తూ విశ్లేషణలు ఇస్తుంది. అసెంబ్లీలో జగన్ స్పీచ్‌లు ఇవ్వడం, వాటికి కౌంటర్లు ప్రచురించడం చేస్తుంది. తాజాగా అమరావతి రాజధానిగా ఎందుకు వద్దు..మూడు రాజధానులు ఎందుకు కావాలనే దానిపై జగన్ భారీ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్‌కు ఒక్కో పాయింట్‌కు ఒక్కో కౌంటర్ ఈనాడు ఇచ్చింది. అమరావతి వల్ల లాభం ఏంటి అనేది చెప్పుకొచ్చింది. అలాగే పోలవరం గురించి తాజాగా అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు. దీనికి కూడా ఈనాడు..జగన్ మాట్లాడిన ఒకో పాయింట్‌కు కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి చూసుకుంటే ఇక నుంచి జగన్ ఏం మాట్లాడిన ఈనాడు కౌంటర్లు ఇచ్చేలా ఉంది.