రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు.

ఇదే క్రమంలో విశాఖకు రాజధాని త్వరలోనే వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే విశాఖ కోసం జే‌ఏ‌సి కూడా ఏర్పాటు చేసి పోరాటం చేయడానికి వైసీపీ రెడీ అయింది. అలాగే విశాఖ మీదుగా వచ్చే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని  ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే అందరిదీ ఒక దారి అనుకుంటే…మంత్రి బొత్స సత్యనారాయణది మరొక దారి అన్నట్లు ఉంది. తాజాగా విశాఖలో జరిగిన మూడు రాజధానులకు సంబంధిచిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాఖ రాజధాని అవుతుందని చెబుతూనే.. అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా, రాజకీయ యాత్రా అన్నది అర్థం కావడం లేదని, విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే చంద్రబాబుకు లేదా అమరావతి రైతులకు కలిగే నష్టమేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుంటాం..తరిమికొడతామని కొందరు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలని బొత్స తప్పుబట్టారు. దయచేసి పరుష పదాలు, ఉద్వేగపూరిత ఉపన్యాసాలు వద్దని, సంయమనం పాటించాలని, ఉద్వేగం ఉండొచ్చుని,  దానిని కాదనడం లేదని, కానీ తరిమికొట్టడాలు, కొట్టుకోవడాలు వంటి పదాలు వాడొద్దని కోరారు. అంటే బొత్స నిర్మాణాత్మకమైన రాజకీయం చేశారని చెప్పొచ్చు. అలాగే విశాఖకు రాజధాని ఎందుకు కావాలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి వీధి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్వేషాలు రేగకుండా బొత్స మాట్లాడారు.