గడప గడపకు గడగడలాడిస్తున్నారా!

ప్రతి ఎమ్మెల్యే, మంత్రి గడప గడపకు వెళ్ళి..మనం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి..ఇంకా పెద్ద ఎత్తున ప్రజల మద్ధతు పొందాలని, అలా పొందని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక విడత గడపగడపకు వెళ్లారు…ఇక రెండో విడత కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరకు వెళుతున్నారు. అటు యథావిధిగానే సీఎం జగన్ బటన్ నొక్కి..ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఇలా నేరుగా ప్రజల ఖాతాల్లోనే డబ్బులు పెట్టడం గురించి…ప్రజలకు క్లియర్ గా వివరించాలనేది జగన్ కాన్సెప్ట్. ఇక ఆ దిశగానే ఎమ్మెల్యేలు వెళుతున్నారు.

అయితే గడప గడపకు వెళుతున్న నేతలకు ప్రజల నుంచి కాస్త స్పందన గట్టిగానే వస్తుంది. కొన్ని చోట్ల ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేలని, మంత్రులని నిలదీస్తున్నారు. కాకపోతే టీడీపీ అనుకూల మీడియా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులని ప్రజలు నిలదీస్తున్నారని, ఎక్కడకక్కడే ప్రశ్నిస్తున్నారని ప్రచారం చేస్తుంది. తాజాగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రాంబాబులని వారి వారి నియోజకవర్గాల్లోనే ప్రజలు పలుచోట్ల ప్రశ్నించారు.

పెరిగిన ధరలపై స్థానిక మహిళలు…బుగ్గనని నిలదీశారు. తమ నుంచి పీల్చిన డబ్బునే తమకు ఇస్తున్నారంటూ కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తకు కూడా డబ్బులు వసూలు చేస్తారా అని కొందరు ఫైర్ అవుతున్నారు. అటు సత్తెనపల్లెలో అంబటి రాంబాబుకు పలుచోట్ల నిరసన ఎదురైంది…పలు సమస్యలపై ప్రజలు ప్రశ్నించారు…అయితే అంబటి పూర్తి స్థాయిలో ప్రజలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఏదేమైనా గాని కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి గాని, అన్నిచోట్ల ఈ పరిస్తితి లేదు…కొన్ని చోట్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు బాగానే స్పందిస్తున్నారు.

ఏదో అక్కడకక్కడ మాత్రమే నిలదీస్తున్నారు…కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం..వైసీపీ ప్రజాప్రతినిధులని ప్రజలు గడప గడపకు గడగడలాడిస్తున్నారని కథనాలు వేస్తుంది. ఆ మీడియా ప్రచారం చేసినంత మాత్రం ఫీల్డ్ లో లేదు.