గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?

అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చారు.

దీంతో వైసీపీ బలం 16కు చేరుకుంది. అంటే దాదాపు జిల్లా మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉంది. కానీ సరైన అభివృద్ధి చేయకపోవడం, రాజధాని అమరావతిని పట్టించుకోకపోవడం, మూడు రాజధానుల నిర్ణయం వైసీపీకి ఇబ్బందిగా మారాయి. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది.

సరే వీటి అన్నిటి వల్ల వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందనుకుంటే…వైసీపీలో జరిగే వర్గ పోరు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చాలా నియోజకవర్గాల్లో వర్గ పోరు నడుస్తోంది. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేశ్, డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాలకు పడటం లేదు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని, మర్రి రాజశేఖర్ వర్గాలకు పొసగడం లేదు. గుంటూరు వెస్ట్‌, ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా గ్రూపు తగాదాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇక మొదట నుంచి వర్గపోరు నడిచే స్థానాల్లో గురజాల కూడా ఒకటి…ఇక్కడ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాలకు పడటం లేదు. కాసు సొంత నియోజకవర్గం నరసారావుపేట. కానీ గత ఎన్నికల్లో జగన్…జంగాని పక్కన పెట్టి కాసుకు సీటు ఇచ్చి టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుకు చెక్ పెట్టారు. గెలిచిన దగ్గర నుంచి కాసు-జంగా వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చీరుకుంది.

ఎమ్మెల్సీగా ఉన్న జంగాకు తాజాగా శాసనమండలి విప్‌ పదవి వచ్చింది…ఈ క్రమంలో స్వగ్రామంలో జంగాకు అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. అయితే జంగా అభినందన సభకు వెళ్ళద్దంటూ ఎమ్మెల్యే కాసు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది…అయినా సరే సభ పెట్టారు. ఇదే సమయంలో జంగా అభిమానులు కట్టిన ఫ్లెక్సీలని అధికారులు తొలగించారు. ఇక ఈ పని ఎమ్మెల్యే కాసుదే అని జంగా వర్గీయులు మండిపడుతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కాసుకు సీటు ఇస్తే జంగా వర్గం వ్యతిరేకంగా పనిచేసేలా ఉంది. మొత్తానికి సొంత పార్టీని సొంత వాళ్ళే ఓడించేలా ఉన్నారు.