కమెడియన్ సుధాకర్ జీవితంలోని జరిగిన బాధాకర సంఘటన ఇదే.. అందువల్లే హీరో కాలేకపోయాడు!

కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో చక్కిలిగింతలు పెట్టిన సుధాకర్ జీవితంలో అనేక చీకటి కోణాలు వున్నాయి. అందుకే హీరో కావలసినవాడు కమిడియన్ అయ్యాడు. మరి కొన్ని సినిమాలలో తన మార్క్ విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఎవరికీ తెలియంది ఏమంటే, తెలుగులో కంటే ముందే తమిళంలో సుధాకర్ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవాలి. ఒక సూపర్ స్టార్ కి సమానంగా ఇమేజ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఉండేదని చాలా కొద్దిమందికి తెలుసు. పెద్ద హీరోగా, స్టార్ హీరోగా ఎదగాల్సిన సుధాకర్ ను తొక్కేశారని ఫిలిం నగర్లో గుసగుసలు వినబడుతూ ఉంటాయి.

సుధాకర్ నేపధ్యం ఒకసారి చూస్తే, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి గంగమాల రత్నం అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు. ఏడుగురు మగ సంతానంలో సుధాకర్ చివరివాడు కావడం విశేషం. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ కు బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలిసినదే. అప్పట్లో సుధాకర్, చిరంజీవి ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు. పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నా తమిళ సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాల వల్ల అక్కడి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి సుధాకర్ వచ్చేశాడు. ఇక్కడికి వచ్చాక సహాయ నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా దాదాపు 600 సినిమాల్లో సుధాకర్ నటించాడు.

చిరంజీవి కంటే ముందే తమిళంలో సుధాకర్ స్క్రీన్ మీద మెరిశాడు. అప్పుడు సుధాకర్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కేవలం 3 సంవత్సరాల్లోనే తమిళంలో 45 సినిమాల్లో నటించి సత్తా చాటాడు. ఇక సుధాకర్ దూకుడును చూసి అప్పట్లో తమిళంలోని ఇతర హీరోలు భయపడ్డారట. దీంతో సుధాకర్ ను తొక్కేయడం ప్రారంభించారట. అదే క్రమంలో ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేశారట. అగ్ర నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు కలిసి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సుధాకర్ ను కుట్రలు చేసి మరీ అడ్డుకున్నారట. దీంతో తెలుగు ఇండస్ట్రీకి సుధాకర్ వచ్చి కమెడియన్ గా స్థిరపడాల్సి వచ్చింది.