మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల నియోజకవర్గం’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
సిద్ధార్థ్ రెడ్డి(నితిన్) జాలీగా తన జీవితాన్ని సాగిస్తుంటాడు. అతడి చిన్ననాటి ఫ్రెండ్ ఝాన్సీ(కేథరిన్ త్రేజా) నితిన్ అంటే ఇష్టపడుతుంది. కానీ, ఆమెపై అలాంటి ఫీలింగ్స్ లేవని చెబుతాడు సిద్ధు. ఈ క్రమంలో స్వాతి(కృతి శెట్టి) అనే అమ్మాయిని చూసిన సిద్ధూ, ఆమెను ప్రేమిస్తాడు. ఒకరోజు సడెన్ గా స్వాతి మాచర్ల వెళ్లిందని తెలుసుకుంటాడు సిద్ధు. ఈ క్రమంలో ఆమెను వెత్తుకుంటూ సిద్ధూ మాచర్లకు చేరుకుంటాడు. అయితే అక్కడ రాజప్ప(సముథ్రకని) మాచర్ల నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. కట్ చేస్తే.. నితిన్ ఐఏఎష్ అధికారిగా మాచర్లలో పోస్టింగ్ తీసుకుంటాడు. అటుపై రాజప్ప అధికారాన్ని, అతడు చేసే అక్రమాలను సిద్ధార్థ్ రెడ్డి ఎలా ఢీకొడతాడు అనేది సినిమా కథ. ఇంతకీ స్వాతి ఎవరు? ఆమెను సిద్ధూ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు ఎంఎస్. రాజశేఖర్ రెడ్డి ఎడిటర్ గా అనుభవం ఉన్నా, దాన్ని ఈ సినిమా దర్శకత్వంలో ఏమాత్రం వినియోగించుకోలేకపోయాడు. అతడి ఈ సినిమా విషయంలో తడబడినట్లుగా ఈ చిత్రం చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఒక కొత్త డైరెక్టర్ అయినా ఇలాంటి రొటీన్ కథను ఇంకాస్త బెటర్ గా తీసుండేవాడేమో అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. మాచర్ల నియోజకర్గం కథనం విషయానికి వస్తే.. ఈ సినిమా ఫస్ట్ హాప్ లో హీరో ఇంట్రొడక్షన్, అతడి చిన్ననాటి ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేయడం.. హీరో నాకు అలాంటి ఫీలింగ్ లేదని చెప్పి వెళ్లిపోవడం పరమ రొటీన్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరోయిన్ ను చూసిన తొలిచూపులోనే హీరోగారు ప్రేమించేస్తాడు. అయితే ఆమె చెప్పాపెట్టకుండా మాచర్లకు వెళ్లిపోవడంతో, ఆమెను వెత్తుకుంటూ హీరోగారు కూడా అక్కడికి వెళతాడు. అయితే అక్కడ కొన్ని ఊహించని సంఘటనలు చూసి హీరోగారు షాక్ అవుతారు. ఇక్కడ వచ్చే ఓ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగిస్తోంది. మొత్తానికి ఫస్టాఫ్ లో ఎలాంటి పస లేని కథతో దర్శకుడు సినిమాను నెట్టుకు రావడంతో సెకండాఫ్ లోనైనా ఏదైనా మంచి కథ ఉంటుందేమో అని ఆడియెన్స్ చూస్తారు.

ఇక సెకండాఫ్ లో ఐఏఎస్ గా మారిన హీరో, మాచర్లను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్న రాజప్ప అనే విలన్ భరతం పట్టేందుకు చేసే పనులనే చూపిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నా, వాటిని ప్లేస్ చేసిన విధానం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఇక రాజప్పతో యుద్ధం ప్రకటించిన హీరో, అతడిని ఎదురించేందుకు వేసే ఎత్తులు మనకు చాలా రొటీన్ గా కనిపిస్తాయి. మొత్తానికి సినిమాను ప్రీక్లైమాక్స్ కు తీసుకొచ్చిన చిత్ర యూనిట్, క్లైమాక్స్ లో నైనా ఏదైనా వైవిధ్యాన్ని చూపిస్తుందేమో అని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేస్తుంది. కానీ, ఇక్కడ కూడా వారికి పూర్తి నిరాశే ఎదురవుతుంది. ఎలాంటి ట్విస్ట్, ఎగ్జైట్మెంట్ లేని ఓ సాధారణ యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్ ను కూడా ముగించేస్తారు.

ఓవరాల్ గా చూస్తే, మాచర్ల నియోజకవర్గం సినిమాలో టైటిల్, అంజలితో కలిసి నితిన్ చేసిన ‘ఐ యామ్ రెడీ’ సాంగ్స్ మినహా, ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏ ఒక్కటి కూడా లేదు. మరీ ఇలాంటి రొటీన్ రొట్టకొట్టుడు సినిమాను మన హీరోలు ఎందుకు చేస్తున్నారా అని ఆడియెన్స్ మరోసారి ఫీలయ్యేలా ఈ సినిమా చేసింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సిద్ధార్థ్ రెడ్డిగా మాస్ లుక్ లో కనిపించిన నితిన్, ఈ సినిమా కోసం తన శాయశక్తులా ప్రయత్నించాడు. అతడు ఫుల్ ఎనర్జీతో ఈ సినిమాలో పర్ఫార్మ్ చేసినా, అది ఈ సినిమా విజయానికి ఏమాత్రం దోహదపడదు. ఇక హీరోయిన్లు కేథరిన్, కృతి శెట్టిలకు పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే పాత్రలైతే ఈ సినిమాలో పడలేదు. అటు కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఈ సినిమాలో రొటీన్ గా కనిపించడంతో ప్రేక్షకులు నవ్వలేకపోతారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తొలి సినిమా అనే విషయాన్ని మర్చిపోయి, ఏదో చేశామా అంటే చేసినట్లుగా ఈ సినిమా ఉంది. కథలో ఎక్కడా ఆసక్తికరమైన అంశం లేకపోవడం.. ఈ సినిమా కథలోని భాగాలు ఇప్పటికే ఎక్కడో చూశామనే భావన కలుగుతుంది. మహతి స్వర సాగర్ ట్యూన్స్ కూడా పెద్దగా కిక్కివ్వలేదు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం ఆయన బీజీఎం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
మాచర్ల నియోజకవర్గం – అక్కడ ఏమీ లేదు బాసు!

రేటింగ్:
2.0/5.0

Share post:

Latest