4 నియోజ‌క‌వ‌ర్గాలు 4 ఆప్ష‌న్లు… బాలినేని శిష్యుడు ఎంట్రీతో వైసీపీలో కాక‌…!

వ‌చ్చే ఎన్నిక‌లు హీటెక్కుతున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల సంఖ్య కూడా వైసీపీలో పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి శిష్యుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారు. వైఎస్ కుటుంబంతోనూ.. ఈయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేని శిష్యుడిగా వైఎస్ కుటుంబానికి ప‌రిచ‌యం అయిన‌.. పెద్దిరెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నారు.

అయితే.. పెద్దిరెడ్డిని బాలినేనే ప్రోత్స‌హిస్తున్నార‌ని.. త‌న‌కు గిట్ట‌ని వారిని ప‌క్క‌న పెట్టేందుకు వ్యూహాత్మకం గా ఆయ‌న పెద్దిరెడ్డిని తెర‌మీదికి తెస్తున్నార‌నే టాక్ కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైఎస్ పాద‌యాత్ర స‌మ‌యం నుంచి కూడా పెద్దిరెడ్డి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి మంచి దూకుడుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాలినేని విజ‌యం కోసం కృషి చేశార‌నే టాక్ ఉంది. ఇక‌, ఇప్పుడు ఆయ‌న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్నేశారు. వీటిలో ఏది ఇచ్చినా.. గెలిచి.. సీఎం జ‌గ‌న్‌కు గిఫ్ట్‌గా ఇస్తాన‌ని అంటున్నారు.

వీటిలో ద‌ర్శి, క‌నిగిరి, గిద్ద‌లూరు, మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలిచే స‌త్తా త‌న‌కు ఉంద‌ని పెద్దిరెడ్డి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ఆయ‌న బాలినేనికే వ‌దిలేశారు. బాలినేని ఎక్క‌డ టికెట్ ఇప్పించినా.. ఓకే అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల‌తో మాజీ మంత్రి బాలినేనికి అస్స‌లు ప‌డ‌డం లేదు.

సో.. దీనిని బ‌ట్టి పెద్దిరెడ్డి ఆలోచన కూడా.. బాలినేని వ్యూహ‌మేన‌నే వాద‌న వినిపిస్తోంది. త‌న‌కు గిట్ట‌ని వారిని త‌ప్పించే వ్యూహంలో భాగంగానే.. బాలిరెడ్డి.. ఇలా పెద్దిరెడ్డిని ముందుకు నెట్టార‌ని.. ఆయ‌న‌కు టికెట్ ఇప్పించే క్ర‌మంలో గిద్ద‌లూరు లేదా.. క‌నిగిరి నుంచి ఒక‌రిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఇప్ప‌టికే రెండు సార్లు సీఎం జ‌గ‌న్‌తోనూ పెద్దిరెడ్డి భేటీ అయ్యారు. ఇక‌, టికెట్ విష‌య‌మే తేలాల్సి ఉంద‌ని ప్ర‌కాశం జిల్లా వైసీపీ వ‌ర్గాల టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.