ఖ‌మ్మం జిల్లాలో ప‌డే కాషాయ పిడుగు ‘ తుమ్మ‌ల ‘ దేనా..!

తెలంగాణ‌లో క్ష‌ణంక్ష‌ణం ఉత్కంఠగా మారుతోన్న రాజ‌కీయాల ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపై కూడా ప‌డింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచ‌న చేరిపోయారు. ఇక తెలంగాణ‌లో ఉమ్మ‌డి జిల్లాల ప‌రంగా చూస్తే బీజేపీకి న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లోనే స‌రైన ప‌ట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్క‌డ ప‌ట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి సోద‌రుడు భువ‌న‌గిరి ఎంపీ వెంక‌ట‌రెడ్డి సైతం రేపో మాపో బీజేపీలో చేరితే జిల్లాలో బీజేపీకి బ‌ల‌మైన అండ‌దండ‌లు ఉంటాయి.

ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాయే. జిల్లాలో కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా కాషాయా కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ద‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మంత్రి హోదాలో ఉండి పాలేరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఉపేంద‌ర్ గులాబీ గూటికి చేరిపోయి టీఆర్ఎస్‌లో స్ట్రాంగ్ అయ్యారు. పార్టీ అధిష్టానం సైతం పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉపేంద‌ర్‌రెడ్డికే ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో పాటు స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న హ‌వానే న‌డిచింది.

 

దీంతో తుమ్మ‌ల రాజ‌కీయంగా రెండేళ్ల‌పాటు సైలెంట్ అయిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో హ‌డావిడి చేస్తున్నా ఆయ‌న‌కు తిరిగి పాలేరు సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఉపేంద‌ర్‌రెడ్డి అధిష్టానం అంచనాల‌కు మించి ప‌నిచేస్తూ ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో, అటు పైన ప‌ట్టు సాధించారు. చాలా వ్యూహాత్మ‌కంగా తుమ్మల వ‌ర్గాన్ని క‌లిపేసుకోవ‌డం, పాలేరు అభివృద్ధి, నాన్ కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ ప‌ర్స‌న్‌గా ఉండ‌డం, అవినీతి లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు కేసీఆర్‌, కేటీఆర్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ్డాయి.

ఇక రెండేళ్లకు పైగా సెలెంట్ అయిన తుమ్మ‌ల ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతూ త‌న ప్రాప‌కం చాటుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీలో మూడొంతుల‌కు పైగా కేడ‌ర్ ఆయ‌న‌కు ఎప్పుడో దూర‌మైపోయారు. ఈ క్ర‌మంలోనే అటు పార్టీలో ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ వ‌స్తుంద‌న్న ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఉన్నారు. అవి నెర‌వేర‌లేదు. ఇటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాలేరు సీటు కూడా రాద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం గత నాలుగైదు నెల‌లుగా కొత్త‌దారులు వెతుక్కుంటూనే వ‌స్తున్నారు.

అప్ప‌ట్లో కాంగ్రెస్‌కు కాస్త ఊపు రావ‌డంతో కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేసినా జిల్లా కాంగ్రెస్ నాయ‌క‌త్వం తుమ్మ‌ల వ‌స్తే పాత కాంగ్రెస్ నాయ‌కుల‌కు గుర్తింపు ఉండ‌ద‌ని.. ఆయ‌నే అంతా పెత్త‌నం చేయాల‌ని చూస్తార‌ని ఒప్పుకోలేదు. దీంతో ఖ‌మ్మంలో ఎవ‌రెవ‌రు దొరుకుతారా ? అని ఎదురు చూస్తోన్న బీజేపీ చూపు తుమ్మ‌ల మీద ప‌డ‌డంతో వాళ్లు వెంట‌నే తుమ్మ‌ల‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లి ఆయ‌న‌కు కొన్ని ఆఫ‌ర్లు ఇచ్చార‌ని తెలిసింది. బీజేపీ – తుమ్మ‌ల మ‌ధ్య రెండు ద‌శ‌ల చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి.

కాషాయ కండువా క‌ప్పుకునేందుకు ఇప్ప‌టికే మానసికంగా సిద్ధ‌మైన తుమ్మ‌ల కొద్ది రోజుల క్రితం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ కార్య‌క్ర‌మంలో త్వ‌ర‌లోనే పిడుగు లాంటి వార్త వింటామని.. కార్య‌క‌ర్త‌లు గ‌తంలో చేసిన త‌ప్పులు పున‌రావృతం కాకుండా చూడాల‌ని చెప్పారు. ఆ పిడుగు లాంటి వార్తే ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం అన్నది బీజేపీ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సైతం ఖ‌మ్మం జిల్లా నుంచి పెద్ద నాయ‌కులు పార్టీలోకి వ‌స్తున్నార‌ని హింట్ ఇచ్చారు. అటు బండి సంజ‌య్‌, ఇటు త‌మ్మ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌కు తోడు.. తుమ్మ‌ల‌కు అధికార పార్టీలో ప్ర‌యార్టీ లేక‌పోవ‌డం.. అటు హామీలు ఇవ‌న్నీ చూస్తుంటే తుమ్మ‌ల కాషాయ కండువా క‌ప్పుకునే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Share post:

Latest