తన సెలబ్రెటీ క్రష్ ఎవరో ఓపెన్‌గా చెప్పిన కృతి శెట్టి

తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల అవక ముందే అందాల తార కృతి శెట్టి కుర్రకారు మదిలో చోటు సంపాదించుకుంది. యువతలో ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమె తమిళంలో హీరో సూర్య సరసన నటించే అవకాశం పట్టేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఆమె రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ సినిమాలో నటించింది. అందులో రామ్ ఎనర్జీకి తగ్గట్టు స్టెప్పులు వేస్తే, అతడికి ధీటుగా మన బేబమ్మ కూడా విజిల్ వేస్తూ చిందేసింది. అందంతో పాటు అభినయం కూడా ప్రదర్శిస్తుండడంతో సూర్య చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సెలబ్రెటీ క్రష్ ఎవరో వెల్లడించి, అందరికీ షాక్ ఇచ్చింది.

సినిమా స్టార్లైనా చాలా మందికి సెలబ్రెటీ క్రష్ ఉంటారు. బాలీవుడ్‌లో జాన్వీకపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ వంటి ఎందరో భామలకు మన విజయ్ దేవరకొండ సెలబ్రెటీ క్రష్. ఈ విషయాన్ని వారు పలు సందర్భాలలో వెల్లడించారు. ఇదే ప్రశ్నను కృతిశెట్టిని అడగ్గానే ఏ మాత్రం తడుముకోకుండా ‘కార్తీ’ అని చెప్పేసింది. ప్రస్తుతం ఆమె హీరో సూర్య సరసన నటిస్తోంది. సెలబ్రెటీ హీరో పేరు మాత్రం ఆయన సోదరుడు కార్తీ పేరు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరోవైపు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. తెలుగులో ఆమె హీరో సుధీర్ బాబు సరసన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో జోడీగా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు రెడీగా ఉన్నాయి.