కేసీఆర్‌ను వ‌ద‌ల‌నంటున్న ఈట‌ల‌.. కొత్త ఆట మొద‌లెట్టేశాడే…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ‌ర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌ధ్య రాజ‌కీయ వివాదం మ‌రింత ముదిరేలా క‌నిపిస్తోంది. గ‌తంలో టీఆర్ ఎస్‌లోనే ఉన్న ఈట‌ల‌.. కొన్నాళ్ల కింద‌ట‌.. తీవ్ర వివాదాస్ప‌ద రీతిలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. మంత్రిప‌ద‌విని వ‌దులుకుని.. బీజేపీలో చేర‌డం.. హుజూరాబాద్ నుంచి బీజేపీటి కెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు ఈ పోరులో ఆయ‌న మ‌రింత దూకుడు పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా కేసీఆర్ పైనే తాను పోటీ చేస్తాన‌ని.. ఈట‌ల ప్ర‌క‌టించారు. వాస్తానికి ఈట‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం.. హుజూరాబాద్‌. అయితే.. వ‌చ్చే ఏడాది తొలి అర్ధ‌భాగంలోనే జ‌ర‌గ‌నున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో తాను కేసీఆర్ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆయ‌న‌పై పోటీ చేసి.. గ‌ట్టి పోటీ ఇచ్చి గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒక పోలిక చెప్పారు.

గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న పార్టీ నుంచి బీజేపీలో చేరి.. త‌న‌కు కంట్లో న‌లుసుగా మారిన‌ సువేందు అధికారిని ఓడించాల‌నే త‌ప‌న‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. సువేందు అధికారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ మిడ్నాపూర్ నుంచి పోటీ చేసి.. ఆయ‌న చేతిలో ఓడిపోయారు. పార్టీ గెలిచినా.. ఆమె మాత్రం ఓడిపోయారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఈట‌ల కూడా తెర‌మీదికి తెచ్చారు.

తాను కూడా కేసీఆర్‌పై పోరాటం చేస్తాన‌న్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ నుంచి పోటీ చేస్తే.. తాను కూడా అక్క‌డ నుంచి పోటీ చేసి.. కేసీఆర్‌ను ఓడిస్తాన‌ని అన్నారు. ఒక‌వేళ కేసీఆర్ ఇక్క‌డ కాదు.. మ‌రెక్క‌డ పోటీ చేసినా.. తాను అక్క‌డ‌కే వెళ్లిపోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుం టున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా.. కేసీఆర్‌ను ఈట‌ల వ‌దిలేలా క‌నిపించ‌డం లేద‌ని అంటు న్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.