రేవంత్ వ‌ల‌లో చిక్క‌ని ఆ మంత్రులు..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ ప‌న్నిన వ్యూహంలో టీఆర్ఎస్ మంత్రులు ఇరుక్కోలేదా..? ఆయ‌న‌ విసిరిన వ‌ల‌కు ఆ చేప‌లు చిక్క‌లేదా..? రేవంత్ దెబ్బ‌కు ఆ మంత్రి ఒంట‌రి వార‌య్యారా..? ముందే ప‌సిగ‌ట్టిన మిగ‌తా మంత్రులు సైలెంట్ అయ్యారా..? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ మ‌రో వ్యూహం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్.. రెడ్డి కుల‌స్థుల‌కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ల‌కు అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని.. రెడ్ల‌ను న‌మ్ముకున్న వారెవ‌రూ న‌ష్ట‌పోలేద‌ని వ్యాఖ్యానించారు. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, నీలం సంజీవ‌రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రుల రెడ్డి వ‌ర్గాల గొప్ప‌త‌నాన్ని కీర్తించారు. దీనిపై తెలంగాణ‌లో మిగ‌తా వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైనా రేవంత్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోలేదు.

దీని వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర పార్టీల్లో ఉన్న రెడ్డి వ‌ర్గాన్ని ఏకం చేసేందుకు రేవంత్ ఈ విధంగా మాట్లాడిన‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు. పైగా ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కే హైద‌రాబాద్ శివారులో రెడ్ల సింహ‌గ‌ర్జ‌న సభ జ‌రిగింది. ఆ స‌భ‌లో చ‌ర్చ‌కు రావాల‌నే రేవంత్ ఇలా ముందుగా కావాల‌నే వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వం త‌ర‌పున ఆ స‌భ‌లో పాల్గొన్న మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడిన మాట‌లు బూమ‌రాంగ్ అయి ఆయ‌న‌పై దాడి చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. రెడ్డి కార్పొరేష‌న్ గురించి మంత్రి ప్ర‌స్తావిస్తార‌నుకుంటే.. ద‌ళిత‌బంధు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కేసీఆర్ పై పొగ‌డ్త‌ల‌తో స‌రిపెట్టారు. దీంతో స‌భ‌కు హాజ‌రైన వారిలో ఓపిక న‌శించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుంటే ఆయ‌న కాన్వాయ్ పై రాళ్లు, కుర్చీలు, వాట‌ర్ బాటిళ్ల‌తో దాడి చేశారు.

ఈ అంశంపై మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ ఇది రేవంత్ ప‌న్నిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. రెడ్ల ముసుగులో దాడి చేయించారని ఆరోపించారు. అయితే మంత్రికి మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ నుంచి ఒక్క‌రు కూడా నిల‌వ‌లేదు. మరో మంత్రి త‌ల‌సాని త‌ప్ప మిగ‌తా రెడ్డి వ‌ర్గం మంత్రులు ఎవ‌రూ నోరు విప్ప‌లేదు. దీంతో మ‌ల్లారెడ్డి నొచ్చుకున్నార‌ట‌.

అయితే.. దీనిపై మ‌రో విధ‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆ స‌భ‌లో మంత్రిపై జ‌రిగిన దాడికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డ‌మంటే స్వ‌యంగా రేవంత్ వ‌ల‌లో చిక్కుకోవ‌డ‌మేన‌నే అభిప్రాయానికి మిగ‌తా రెడ్డి వ‌ర్గం మంత్రులు వ‌చ్చార‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై రెడ్లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. ఇపుడు మంత్రికి వ‌త్తాసు ప‌లికితే రెడ్లు మొత్తానికే పార్టీకి దూర‌మ‌వుతార‌నే సందేహంతో సైలెంట్ అయ్యార‌ట‌. బీసీలు టీఆర్ఎస్‌, బీజేపీ వైపు వెళుతుండ‌డంతో రెడ్లంద‌రినీ ఏకం చేసి కాంగ్రెస్ వైపు లాగుదామ‌నే రేవంత్ ప్ర‌య‌త్నం ప్ర‌స్తుతానికి పూర్తి స్థాయిలో ఫ‌లించ‌లేద‌నే చెప్పాలి. చూడాలి మ‌రి రేవంత్ ఇంకెలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తారో..!