Sr. NTR ఎడమచేయి చాచడం వెనుక కథ ఇదే..!

Sr. NTR… పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో పురాణ పాత్రలకు పెట్టింది పేరు. తన అద్భుత నటనతో దేవుళ్ళు అంటే ఇలాగే వుంటారా అని జనాలకు ఆ మహానటుడుని చూసాకే అర్ధం అయ్యింది. అలాంటి మహానటుడికి ఓ విషయంలో కాస్త వ్యతిరేకత ఉండేది. పురాణ కథల పట్ల ఇంత సాధికారత కలిగిన ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించి, ఎడమ చేతితో దీవించడం అనేది అప్పట్లో చాలామందికి మింగుడు పడలేదు. పైగా ఈ మార్పు 1977 నుంచి ఆయనలో స్పష్టంగా కనిపించింది. అప్పట్లో ఈ విషయమై కధలు కధలుగా మాట్లాడుకునేవారు.

దానవీరశూరకర్ణ చిత్రం వరకు కుడిచేతితో దీవించిన NTR ఆ తర్వాత పోషించిన పౌరాణిక పాత్రల్లో సడెన్ గా ఎడమ చేతిని వాడటం చాలామందికి అర్ధం కాలేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుపట్టని విషయం అయింది అప్పట్లో. అందువలన దీనిపై ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. కొంతమంది ఈ విషయం గురించి NTRని అడిగితే, అప్పుడు NTR దాని గురించి అద్భుతంగా వివరించారు.

మన హృదయం ఉన్నది ఎడమవైపు. అలాగే పూజలో వున్నపుడు అర్ధాంగిని ఎడమ వైపు కూర్చోబెట్టుకుంటారు. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమచేతే. ఎడమ చేతికి ఉన్న ప్రాశస్త్యం కుడి చేతికి లేదు. అందుకే ఎడమచేతితో ఆశీర్వదిస్తున్నాను అని చెప్పారట. ఇక ఆ మాట విన్న తరువాత అడిగిన నోళ్లు మూతలు పడ్డాయి.

అయితే కొన్నాళ్ళకు ఈ వామ హస్త అభయం వెనుక అసలు రహస్యం వేరే ఉందని తెలిసింది. అదేంటంటే.. షూటింగ్ లో జరిగిన పలు ప్రమాదాల వలన NTR కుడిచెయ్యి దాదాపు 5 సార్లు విరిగిపోయిందట. వరుసగా కుడిచేయి విరగడం వల్ల నరాలు ఇంచుమించు పనిచేయడం మానేశాయట. అందుకే ఈ సమస్యను అధిగమించడం కోసం అభయం అంటే ఎడమచేతిని చూపించడం మొదలు పెట్టారు NTR.