కోల్‌బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ త‌ప్ప‌దా..!

సింగ‌రేణి, కోల్‌బెల్ట్ ఏరియా ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా? కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉన్నారా..? త‌మ అస‌మ్మ‌తిని ఓట్ల రూపంలో తెలియ‌జేసేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారా..? ఇక ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి ఎదురీత త‌ప్ప‌దా..? అంటే ప‌రిశీల‌కులు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నారు.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప‌ట్ల కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌కు వ్య‌తిరేకంగా ఆయా రంగాల ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఎల్ఐసీ, బ్యాంకింగ్‌, రైల్వే, బీమా త‌దిత‌ర రంగాల ఉద్యోగులు బీజేపీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆయా సంస్థ‌ల‌ను దివాలా దిశ‌గా న‌డిపి ప్రైవేటు పరం చేయ‌బోతున్నార‌ని ఆయా సంస్థ‌ల‌ ఉద్యోగులు ఆందోళ‌న‌గా ఉన్నారు. దీనిపై అక్క‌డ‌క్క‌డా బ‌హిరంగంగానే ఉద్య‌మిస్తున్నారు. ఇందులో సింగ‌రేణి, కోల్ బెల్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని చూస్తున్న బీజేపీకి కోల్ బెల్ట్ ఏరియాలో తీవ్ర వ్య‌తిరేక‌త త‌ప్పేలా లేదు. ఉత్త‌ర తెలంగాణలోని నాలుగైదు జిల్లాల‌కు విస్త‌రించి ఉన్న‌ది ఈ ప్రాంతం. దీని ప‌రిధిలో దాదాపు ప‌దికి పైగా నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ బ‌లం అంతంత మాత్ర‌మే. కేవ‌లం అర్బ‌న్ ప్రాంతాల్లో మాత్ర‌మే బ‌లం పెంచుకుంటున్న బీజేపీకి ఈ కోల్ బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త మింగుడుప‌డ‌ని అంశ‌మే.

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో కోల్ బెల్ట్ ప‌రిధి విస్త‌రించి ఉంది. ఈ ప్రాంతాల్లో సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంప‌ల్లి, మంచిర్యాల‌, ఆసిఫాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ఇల్లెందు, కొత్త‌గూడెం, పెద్ద‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్, ములుగు త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. క్రితం ఎన్నిక‌ల్లో ఈ స్థానాల‌ను టీఆర్ఎస్‌, కాంగ్రెస్ కైవ‌సం చేసుకున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి టీఆర్ఎస్ పై ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉండ‌డంతో బీజేపీ పాగా వేయాల‌ని భావిస్తోంది. కానీ కేంద్ర ప్ర‌భ‌త్వ విధానాలు ఎక్క‌డ త‌మ‌కు ఆటంకంగా మారుతాయోన‌నే ఆందోళ‌న బీజేపీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇన్ని రోజులూ మ‌తం, భావోద్వేగాల‌ పేరిట యువ‌త‌లో విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి అర్బ‌న్ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును పెంచుకుంటున్న బీజేపీ ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో వెనుక‌బ‌డే ఉంది. ఇపుడు ఈ సింగ‌రేణి, కోల్ బెల్ట్ ఏరియాలోని వ్య‌తిరేక‌త నుంచి ఎలా గ‌ట్టెక్కాల‌నే మీంమాంస‌లో కొట్టుమిట్టాడుతోంది. పైగా ఇటీవ‌ల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు కూడా తొలుత‌ బీజేపీలో చేరాల‌ని భావించారు. కానీ కోల్ బెల్ట్ ప‌రిధిలో బీజేపీపై వ్య‌తిరేక‌త గ‌మ‌నించి కాంగ్రెసులో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ స్థానాల్లో బీజేపీ పుంజుకుంటుందా..? లేదా తిరిగి టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు వ‌దులుకుంటుందా..? అనేది వేచి చూడాలి.

Share post:

Popular