గని దెబ్బకు బయ్యర్ల నోట్లో మట్టి..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గని’ గత మూడేళ్లుగా ఊరిస్తూ వచ్చి, ఎట్టకేలకు గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో మనోడి పర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక సినిమా రిలీజ్ రోజునే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనం పెద్దగా సమయం కూడా కేటాయించేందుకు ఇష్టపడలేదు.

రొటీన్ రొట్టకొట్టుడు సినిమాగా గని రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా దారుణంగా తయారైంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కేవలం రూ.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా బయ్యర్లు భారీ నష్టాలను చవిచూడక తప్పేలా లేదు. మరో రెండు రోజుల్లో ఈ సినిమాను థియేటర్ల నుండి ఎత్తేయడం ఖాయం. బీస్ట్, కేజీఎఫ్2 వంటి పాన్ ఇండియా క్రేజీ మూవీలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో ‘గని’ని పక్కనబెట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

కంటెంట్ లేని సినిమాను దాదాపు పాతిక కోట్లకు బయ్యర్లు కొనడం, ఇప్పుడు అందులో పావు వంతు కూడా ఈ సినిమా కలెక్ట్ చేయకపోవడంతో బయ్యర్ల నోట్లో మట్టే అంటున్నారు సినీ క్రిటిక్స్. మరి ఇలాంటి మోస్తరు సినిమాలకు ఇంతగా హైప్ తీసుకొచ్చి, బయ్యర్ల చేత అంతంత డబ్బులకు కొనేలా చేసి నిర్మాతలు మాత్రం సేఫ్‌గా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు కామెంట్ చేస్తున్నారు.