ఏపీ సీఎం జగన్ వ్యూహం అదిరిపోయింది. ఆయన చెప్పాలనుకున్న మాటను.. నేరుగా చెప్పకుండానే.. చెప్పకనే చెప్పారు. ఇదొక చిత్రమైన విషయం. అయినా.. జగన్ ఎక్కడా విషయాన్ని నేరుగా వెల్లడించకుండా.. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న.. ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్న వారి నోటికి ఆయన ఇండైరెక్ట్‌గా తాళాలు వేసేశారు. అదే.. ముందస్తు ఎన్నికలు! గత ఆరు మాసాలుగా.. ఏ పార్టీని కదిలించినా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని.. జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని.. పదే పదే చెబుతున్నారు. బీజేపీ అయితే.. ఏకంగా.. త్వరలోనే ఎన్నికలు వచ్చేస్తాయన్నట్టుగా కలరింగ్ ఇచ్చేసింది. అంతేకాదు.. సీఎం అభ్యర్థిని మేమే నిర్ణయిస్తాం.. అంటూ.. సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇక, టీడీపీ పరిస్థితి సరేసరి. పార్టీనేతలు ఎక్కడ అవకాశం వస్తే.. అక్కడ ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో అయితే.. మరింత ఎక్కువగానే ఈ ప్రచారం ఉంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు. జగన్ పని అయిపోయింది.. సో.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. అని ఆయన ఊదరగొడుతున్నారు. అంతేకాదు.. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. సీఎం జగన్‌కుముందుగానే సలహా ఇచ్చేసిందని.. ప్రశాంత్ కిశోర్ కూడా జగన్ కు ఇదే సలహా ఇచ్చారని.. సో.. జగన్ కూడా రెడీ అవుతున్నారని.. చంద్రబాబు పార్టీ నేతలకు ఎప్పుడు ఎక్కడ మీటింగులు నిర్వహించినా.. బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు.
ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కూడా ముందస్తు పేరు ఎత్తలేదు కానీ.. పార్టీ ఆవిర్భావ సభలో.. ఎన్నికలకు ముందు ఇవ్వాల్సిన.. హామీలను ప్రజలపై గుప్పించారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత ఇసుక ఇస్తామని.. అదేవిధంగా ఏటా 5 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి కింద నిధులు ఇస్తామని.. ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని.. ప్రకటించారు. అయితే.. ఇదంతా విన్నవారు చూసిన వారు.. పవన్ కూడా ముందస్తుకు రెడీ అవుతున్నారనే అనుకున్నారు. ఇలా.. మొత్తంగా.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. కూడా ముందస్తుకు రెడీ అయిపోతున్నాయనే భావన వ్యక్తమైంది.
అయితే.. తాజాగా జగన్ ఈవిషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా.. రాష్ట్రంలో ముందస్తుకు అవకాశమే లేదనే సంకేతాలు పంపించారు. ఎలా అంటే.. తన ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి వరకు అంటే.. 2023 మార్చి (ఏడాది ఉంది) సంక్షేమ పథకాలను ఏవేవి అమలు చేస్తారు? ఎప్పుడెప్పుడు అమలు చేస్తారు? అనే విషయాలను ఆయన పూసగుచ్చినట్టు వివరించారు. అంటే.. ఏడాది పాటు.. తమ పాలన పూర్తిగా సాగుతుందని.. జగన్ చెప్పకనే చెప్పారన్నమాట. దీనికి బట్టి ఏడాది వరకు ముందస్తు లేనట్టే కదా! సో.. ఆ విధంగా జగన్ ముందస్తు ముచ్చటపై తనదైన శైలిలో చెక్ పెట్టారని అంటున్నారు వైసీపీ నాయకులు.