ఎమ్మెల్యే వ‌ద్దు… ఎంపీయే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ట్విస్టు అనుకోవాలి. చాలా మంది ఎంపీలు గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఏం చేయ‌లేక‌పోతున్నారు. కొంద‌రు ఎంపీలు అయితే పార్ల‌మెంటుకు వెళ్లి కూర్చొని రావ‌డం మిన‌హా చేసేదేం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పారు. తీరా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఏపీ ప్ర‌జ‌లు 22 మంది ఎంపీల‌ను గెలిపించారు. వీరిలో మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణ లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు త‌ప్పా ఎవ్వ‌రూ కూడా అస‌లు ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు.. పార్ల‌మెంటులో ఏ మాత్రం నోరు మొద‌ప‌డం లేదు.

నందిగం సురేష్‌, మాధ‌వి, స‌త్య‌వ‌తి, అనూరాధ‌, రంగ‌య్య‌, గోరంట్ల మాధ‌వ్, వంగా గీతతో పాటు చాలా మంది అస‌లు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదు. కోట‌గిరి శ్రీథ‌ర్ ఎక్కువుగా విదేశాల్లోనే ఉంటోన్న ప‌రిస్థితి. ఇక మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎక్కువుగా వ్యాపారాల‌కే ప‌రిమితం అవుతున్నారు. అస‌లు ఎంపీగా పోటీ చేయ‌మో అని చాలా మంది మొత్తుకుంటున్నారు. త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టిక్కెట్ కావాల‌ని వారు కోరుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ ఎమ్మెల్యే మాత్రం త‌న‌కు ఎంపీ టిక్కెట్ కావాల‌ని కోరుతున్నార‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.

విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్నీప‌ట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. 2014లో మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్నపాత్రుడిపై స్వ‌ల్ప తేడాతో ఓడిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో గెలిచారు. ఆ త‌ర్వాత బ‌లోపేతం కోసం అయ్య‌న్న సోద‌రుడిని కూడా వైసీపీలోకి తీసుకువ‌చ్చారు. ఆయ‌న న‌ర్సీప‌ట్నం ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌ని క‌సితో ఎమ్మెల్యే అయితే స్థానిక ప‌రిణామాలు, రాష్ట్రంలో ప‌రిణామాల‌తో ఏం చేయ‌లేక‌పోయారు.

క‌నీసం చిన్న చిన్న ప‌నులు కూడా చేయించుకోలేని ప‌రిస్థితుల్లో ఆయ‌న ఉన్నారు. దీంతో విసుగొచ్చిన ఆయ‌న ఎంపీగా గెలిస్తేనే బాగుంటుంద‌ని.. క‌నీసం ఢిల్లీలో కొంత ప‌లుకుబ‌డి అయినా పెరుగుతుంద‌ని.. ఆ నిధుల‌తో అయినా త‌న సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామ‌న్న సంతృప్తి ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఫెయిర్ పాలిటిక్స్‌కు తోడు రెండు మూడు భాషలపైనా గట్టి ప‌ట్టు ఉండ‌డం, ఇటు ఆయ‌న సోద‌రుడు పూరి జ‌గ‌న్నాథ్ సినిమా డైరెక్ట‌ర్‌గా ఉండ‌డంతో ఆయ‌న దృష్టంతా ఎంపీ సీటు మీదే ఉందంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అన‌కాప‌ల్లి నుంచి లోక్‌స‌భ‌కే పోటీ చేస్తార‌ని టాక్ ? ఏదేమైనా ఉమాశంక‌ర్ గ‌ణేష్ రివ‌ర్స్ నిర్ణ‌యం విచిత్ర‌మే..?

Share post:

Popular