ప్ర‌జా నాయ‌కుడు మేక‌పాటి గౌతంరెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదే..!

జ‌గ‌న్ కేబినెట్‌లో యువ మంత్రిగా, వివాదాల‌కు దూరంగా రాజ‌కీయాలు చేసే.. మేక‌పాటి గౌతంరెడ్డి ఇక లేరు. రాజ‌కీయాల్లో అతిత‌క్కువ కాల‌మే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారే త‌ప్ప‌.. ఇత‌ర నేత‌ల మాదిరిగా.. ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించి.. పేరు పోగొట్టుకున్న‌.. ముఖ్యంగా నిర్మాణాత్మ‌క‌ రాజ‌కీయాల‌కు కేంద్రంగా ఉన్న త‌మ కుటుంబానికి చెడ్డ పేరు వ‌చ్చేలా ఏనాడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చ‌న గౌతం రెడ్డి.. రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం ద‌క్కించుకున్నారు.

2014, 2019లో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకు గౌతంరెడ్డి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌ల్లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌స్య ఏదైనా.. ఎలాంటిదైనా.. ఫోన్ చేస్తే చాలు.. అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయేవారు. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా శతృవులు లేకుండా పోయారు. అంతేకాదు.. ఏ చిన్న స‌మ‌స్య‌తో త‌న‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చినా.. సాద‌రంగా ఆహ్వానించి.. వారి స‌మ‌స్య‌ను ఆసాంతం వినే ల‌క్ష‌ణం కూడా మేక‌పాటి సొంతం. అందుకే ఆయ‌న అచిర కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. గ‌తంలో త‌న తండ్రి రాజ‌మోహ‌న్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్న‌ప్పుడు కూడా అధికారాన్ని వినియోగించుకున్న దాఖ‌లాలు మ‌న‌కు గౌతంలో క‌నిపించ‌వు.

పార్టీలో అంద‌రినీ క‌లుపుకొని పోయే మేక‌పాటి 1971లో జ‌న్మించారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన ఆయ‌న పారిశ్రామిక వేత్త‌గా ఎదిగారు. ఇంగ్లీష్‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డంతోపాటు..పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌న నిత్యం అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు, ఆలోచ‌న‌ల‌కు తెర‌దీసేవారు. వైసీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన వారిలో గౌతంరెడ్డి కూడా ఒక‌రు. అయితే.. ఆయ‌న ఎప్పుడూ ఆడంబ‌రాలకు.. మీడియాలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌రు. త‌ను ఏం చేసినా..సైలెంట్‌గా చేస్తారు. క‌రోనా స‌మ‌యంలో రెండు సంవ‌త్సరాలు.. తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని.. ఆయ‌న త‌ర‌చుగా చెప్పేవారు. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు తెచ్చుకున్న గౌతంరెడ్డి.. రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Share post:

Latest