ప‌వ‌న్ చెల‌గాటంతో భీమ్లానాయ‌క్‌కు కొత్త టెన్ష‌న్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగు సినిమా స్టార్ హీరో మాత్ర‌మే కాదు.. అటు ఓ పొలిటిషీయ‌న్ కూడా..! ప‌వ‌న్ త‌న జ‌న‌సేన పార్టీ ద్వారా గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో పోటీ చేశాడు. స‌రే ఇదంతా సినిమాల్లో అన‌వ‌స‌రం.. అయితే ప‌వ‌న్‌ను రాజ‌కీయాల్లో ఉండ‌డంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాల‌పై కూడా ప‌డుతోంది. రాజ‌కీయ నాయ‌కులు ప‌వ‌న్‌ను సినిమాల ప‌రంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ప్ర‌భుత్వం ఎప్పుడూ లేని విధంగా సినిమా టిక్కెట్ల‌పై నియంత్ర‌ణ తీసుకువ‌చ్చింది. గ‌తేడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు రోజుల నుంచి ఈ నియంత్ర‌ణ స్టార్ట్ అయ్యింది. అప్ప‌టి నుంచి ఇది ఓ కొలిక్కి రావ‌డం లేదు.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌నే టార్గెట్ చేస్తూ తాను టిక్కెట్ రేట్లు పెంచ‌మ‌ని దేబ‌రించ‌న‌ని.. అవ‌స‌రం అయితే త‌న సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాన‌ని జ‌గ‌న్‌ను మంటక్కేలా మాట్లాడారు. ఇది వైసీపీ వ‌ర్గాల‌కు తీవ్ర‌మైన ఆగ్ర‌హం తెప్పించింది. పైగా సాయిధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్లోనూ ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఓ వైపు చిరంజీవి లాంటి వాళ్లు ఏపీ ప్ర‌భుత్వంతో సఖ్య‌త కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప‌వ‌న్ మాత్రం ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. ఇక ప‌వ‌న్ సినిమా ఎప్పుడు వ‌చ్చినా ఏపీ ప్ర‌భుత్వం కాచుకునే ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. అందుకే చిరంజీవి లాంటి వాళ్లు జ‌గ‌న్‌ను క‌లిసినా ఇప్ప‌ట‌కీ టిక్కెట్ల రేట్లు పెంపు జీవో అయితే రాలేదు. ప‌వ‌న్ సినిమా మ‌రో మూడు రోజుల్లో రిలీజ్ అవుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌ట్టిగా టార్గెట్ చేస్తే భీమ్లానాయ‌క్‌ను పాత రేట్ల‌కు అమ్ముకోవాలి. అప్పుడు ఆ సినిమా ప‌రిస్థితి మ‌రింత ఘోరం అవుతుంది.

ఇప్ప‌టికే ఇది రీమేక్ సినిమా.. పైగా బ‌జ్ లేదు. ఇలాంటి టైంలో ఏపీ స‌ర్కార్ భీమ్లాను టార్గెట్ చేస్తే ఈ సినిమా అమ్మిన రేట్ల‌ను బ‌ట్టి చూస్తే ఎంత హిట్ టాక్ వ‌చ్చినా బ‌య్య‌ర్లు, నిర్మాత‌లు నిండా మునుగుతారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే రేట్లు పెంపు జీవో ఇవ్వాల్సి ఉన్నా కూడా కేవ‌లం భీమ్లానాయ‌క్‌కు ఆ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌కూడ‌ద‌నే ఈ జీవో ఇవ్వ‌లేదంటున్నారు. తాజాగా ప‌వ‌న్ న‌ర‌సాపురం ప‌ర్య‌ట‌న‌లో కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేశారు. ఇవ‌న్నీ భీమ్లానాయ‌క్‌కు ఏపీలో దెబ్బ‌ప‌డేలా ఉన్నాయి.