టీడీపీ నుంచి గంటా అవుట్‌.. బాబు డెసిష‌న్‌పై ఒక్క‌టే ఉత్కంఠ‌…!

ఏపీలో టీడీపీ ఇంచార్జ్‌ల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధిష్టానం నుంచి ఈ రోజు పిలుపు వ‌చ్చింది. ఎమ్మెల్యేలు అయితేనే, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు అయితేనే మొత్తం 12 మందికి ఈ రోజు హైక‌మాండ్ నుంచి పిలుపులు వెళ్లాయి. వీరిలో ఈ రోజు కొంద‌రు ఇన్చార్జ్‌లు, ఎమ్మెల్యేల భ‌విత‌వ్యం తేలిపోనుంది. ఈ లిస్టులో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పేరు కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. దీంతో గంటా నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని డివిజ‌న్ల‌లో వైసీపీయే పాగా వేసింది. అస‌లు పార్టీ కార్య‌క్ర‌మాల‌తో పాటు హైక‌మాండ్ పిలుపు ఇచ్చినా ఏ కార్య‌క్ర‌మాలు చేయ‌డం లేదు. 2019 త‌ర్వాత ఆయ‌న టీడీపీలో క్రియాశీల‌కంగానూ లేరు.. అటు సీనియ‌ర్ నేత‌గా ఉండి చంద్ర‌బాబు, లోకేష్‌పై జ‌రుగుతున్న మాట‌ల దాడిని మ‌న‌స్ఫూర్తిగా ఖండించ‌నూ లేదు.

మ‌ధ్య‌లో ఓ సారి ఆయ‌న బీజేపీలోకి వెళ‌తార‌ని.. మ‌రోసారి వైసీపీలోకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే గంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ చేసిన రాజీనామా కూడా ఆమోదం పొంద‌లేదు. ఇక గంటా శుక్ర‌వారం స‌మావేశానికి హాజ‌రు కాక‌పోతే ఆయ‌న స్థానంలో నార్త్ నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో ఇన్‌చార్జ్‌ను నియ‌మిస్తార‌ని టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదే జ‌రిగితే ఆయ‌న టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు కూడా మాన‌సికంగా సిద్ధ‌మైన‌ట్టే అని అంటున్నారు. ఒక‌వేళ ఆయ‌న మ‌న‌సు మార్చుకుని స‌మావేశానికి వ‌స్తే టీడీపీలో ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా గంటా – టీడీపీ లింక్ ఈ రోజుతో తేలిపోనుంది.