ఇక్క‌డ ఎవ‌రు గెలిస్తే నెక్ట్స్ తెలంగాణ సీఎం వాళ్లే…!

ఏపీ, తెలంగాణ‌లో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా టైం ఉన్నా కూడా అప్పుడే రెండు చోట్ల రాజ‌కీయ వేడి అయితే రాజుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అవుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు కీల‌కం కానుంది. ఇప్పుడు అధికార ,ప్ర‌తిప‌క్ష పార్టీలు అంద‌రూ కూడా ఈ రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌మీద గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే అధికారం వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ విప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్ న‌డుస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 31 సీట్లు కీల‌కం కానున్నాయి. ఈ 31 సీట్ల‌లో గెలిచిన పార్టీయే రేపు అధికారంలోకి వ‌స్తుంది.. ఆ పార్టీ అధినేతే ముఖ్య‌మంత్రి కానున్నారు. మొత్తం 119 స్థానాల్లో ఈ 31 సీట్లలో పాగా వేసే పార్టీనే.. అధికారంలోకి వస్తుందనే విధంగా తెలంగాణ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థాననాలు ఉంటే.. వాటిలో ఎస్టీ 12 ఎస్సీ 19 స్థాననాలు ఉన్నాయి. అంటే. మొత్తం 31 . ఈ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీయే రేపు అధికారానికి ద‌గ్గ‌ర అవుతుంది. అయితే గ‌త ప‌దేళ్ల‌లో ఈ స్థానాల్లో టీఆర్ఎస్ చాలా వ‌ర‌కు పాతుకుపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా త‌మ సంస్థాగ‌త ఓటు బ్యాంకుతో ఇక్క‌డ బ‌లోపేతం అవుతోంది.

ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు బ‌లంగా ఉండేది. అయితే తెలంగాణ ఏర్ప‌డ్డాక జ‌రిగిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ఓటు బ్యాంకు దూర‌మైంది. అయితే ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సైతం ప్ర‌ధానంగా ఈ ఓటు బ్యాంకును ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయం న‌డుపుతున్నార‌ట‌. ఏదేమైనా 2023 తెలంగాణ అధికార పీఠాన్ని ఈ 31 సీట్లే డిసైడ్ చేయ‌నున్నాయి.