స‌మ‌ర‌సింహారెడ్డి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న హీరోయిన్‌.. ఎంత బ్యాడ్ ల‌క్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరపురాని సినిమాలలో సమరసింహారెడ్డి ఒక‌టి. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డులు అన్నింటికీ సమరసింహారెడ్డి పాతర‌ వేసింది. బాలయ్య – బి గోపాల్ కాంబినేషన్ అంటేనే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలను అందుకున్న‌ సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు 77 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. లేట్‌ రిలీజ్ లో కూడా శతదినోత్సవం జరుపుకున్న ఘనత సమరసింహారెడ్డి దక్కుతుంది.

తెలుగులో అప్పటి వరకు ప్రేమ సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్ అయ్యేది. అయితే ప్రేమ సన్నివేశాలు లేకుండా… పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రికార్డు సమరసింహారెడ్డికే దక్కుతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర పనిచేస్తున్న రత్నం సలహామేరకు విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథకు రాయలసీమ ఫ్యాక్షన్ జతచేశారు. ముందుగా ఈ సినిమాకు సమరసింహ అనే టైటిల్ అనుకున్నారు.

అయితే పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు దానిని సమరసింహా రెడ్డిగా మార్చారు. మ‌ణిశ‌ర్మ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సమరసింహారెడ్డి. ముందుగా ఈ సినిమాలో రాశి – సంఘ‌వి -అంజ‌లా ఝ‌వేరిల‌ను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే రాశి ఈ సినిమాలో సీతాకోకచిలుక సన్నివేశానికి ఒప్పుకోలేదు. అయితే బి.గోపాల్ రాశి స్థానంలో సిమ్రాన్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ రోజుల్లో 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రు. 16 కోట్ల వసూళ్లు రాబట్టింది.

122 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న సమరసింహా రెడ్డి, 77 కేంద్రాల్లో 100 రోజులు…. 29 కేంద్రాలలో 175 రోజులు, మూడు థియేటర్లలో 225 రోజులు ఆడి అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. రాశి సమరసింహా రెడ్డి సినిమా చేసి ఉంటే ఆమె ఖచ్చితంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయి ఉండేది. అయితే ఆమె దురదృష్టం కొద్దీ ఈ సినిమా మిస్ చేసుకుంది. ఈ సినిమాతో హిట్ కొట్టిన సిమ్రాన్ మరోసారి బాలయ్య ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.