చిరంజీవి కాదు… పతనం దిశగా తెలుగు సినిమా పరిశ్రమ..

కరోనాతో నానా అవస్థలు పడిన తెలుగు సినిమా పరిశ్రమ.. ప్రస్తుతం ఏపీ సర్కారు విధానాలతో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. కొంత కాలం క్రితం జరిగిన మా ఎన్నికల వేళ ఇండస్ట్రీలో లుకలుకలు ఓ రేంజిలో బయటపడ్డాయి. చిరంజీవిని తొక్కేందుకు ఓ సామాజిక వర్గం కంకణం కట్టుకుంది. చిరంజీవి పెద్దరికం కనబడకుండా ప్రయత్నాలు చేసింది. అనుకున్నట్లుగానే విజయం సాధించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు మా పెద్దలు. చిరంజీవిని గౌరవించి ఉంటే తను మాట్లాడే వాడు. తనను కాదని వేరేవారికి పట్టం కట్టడంతో ఆయన కూడా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు. మొత్తంగా సినిమా పరిశ్రమ మరిన్ని ఇబ్బందులతో సతమతం అవుతుంది.

ప్రస్తుతం సినిమా పరిశ్రమ విషయంలో జగన్ సర్కారు తీసుకునే నిర్ణయాలను ఎదిరించే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఇన్నాళ్లు చిరంజీవి లేదంటే పవన్ మాట్లాడేవారు. మా ఎన్నికల వేల వారిని దెబ్బతీయడంతో వారు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. అటు చిరంజీవికి ఉన్న పలుకుబడి, సినిమా పరిశ్రమలో ఆయనకున్న గుర్తింపును దెబ్బ కొట్టేందుకు ఏపీ సర్కారు ఎత్తులు వేసింది. అందులో భాగంగానే టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. తాజాగా కరోనా పేరుతో ఆక్యుపెన్సీ కెపాసిటీని కట్ చేసింది. ఆయనను తొక్కేందుకు చేసే ప్రయత్నం మొత్తంగా సినిమా పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే చిరంజీవిని కాదన్న వాళ్లు.. జగన్ సర్కారు నిర్ణయాలను ఎదిరించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. సినిమా పరిశ్రమను ఓవర్ నైట్ లో అద్భుతంగా తీర్చిదిద్దుతానన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు పత్తా లేకుండాపోయాడు. కేవలం ఆయన మా అధ్యక్షుడు అనే టాగ్ మెడకు వేసుకుని తిరగడం తప్ప చేసేదేమీ లేదు అనేది ఇప్పటికే అర్థం అయ్యింది. జగన్ కు చుట్టాలు అయిన మంచు కుటుంబ సభ్యులే సైలెంట్ కావడంతో ఇంకా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడతారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

గతంలో ఏ సమస్య వచ్చిన చిరంజీవి.. దాని పరిష్కారానికి పరిశ్రమ పెద్దలను తీసుకెళ్లి ప్రభుత్వాలతో మాట్లాడేవాడు. కానీ ప్రస్తుతం ఏపీ సర్కారుతో మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. మొత్తంగా ఒకప్పుడు కొందరు ఆధిపత్య కులాల చేతుల్లో ఉండిపోయిన పరిశ్రమ ప్రస్తుతం ఏదిక్కులేని అనాథలా మారిపోయింది. ఏపీ సర్కారు సినిమా పరిశ్రమ బాగు కోసం నిర్ణయాలు తీసుకోకపోతే.. మున్ముందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.