ఆయన రాక వెనుక అంతరార్థం ఏమిటో..?

ఎప్పుడూ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు.. ఉండమన్నా ఉండడు.. నాయకులు, కార్యకర్తలు బలవంత పెడితే కాసేపు మాట్లాడతాడు.. ముఖ్య నాయకులతో సమావేశం కావాలంటే ఇక్కడకు వచ్చినపుడు కుదరదు.. ఢిల్లీకి వెళ్లి కలవాల్సిందే.. అంత బిజీ ఆయన.. ఆయన ఎవరో కాదు భారతీయ జనతా పార్టీని పగ్గాలు పట్టుకొని నడిపిస్తున్న జేపీ నడ్డా.. ప్రధాని మోదీకి అత్యంత ఇష్టుడు.. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి..అందులోనూ అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న నడ్డా హైదరాబాదుకు వస్తున్నాడు. అందులో ఏముంది గొప్ప అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం లేదు. భాగ్యనగరిలో నాలుగు రోజుల పాటు ఉంటున్నాడు. నాలుగు రోజులంటే మాటలు కాదు.. అంత బిజీగా ఉన్న నాయకుడు సిటీలో ఇంత సమయం ఉంటున్నాడని తెలిసి బీజేపీ కార్యకర్తలు, నాయకులు పండగ చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మొదలు రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఆయన అపాయింట్ మెంట్ కోరారు. హైదరాబాదులోని అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఈనెల 5,6,7 తేదీలలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నడ్డా ఈనెల 4న సాయంత్రం సిటీకి వస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ సమావేశాలు కదా.. వస్తున్నాడంటే మామూలే కానీ 4 రోజుల పాటు ఉంటున్నాడంటే ఏదో ప్లాన్ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసలే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు, నిప్పులా రాజుకుంటున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని బీజేపీ కార్యక్రమాలను అడ్డుకుంటోందని, అధికార పార్టీకి లేని కోవిడ్ నిబంధనలు బీజేపీకి వర్తిస్తాయని పేర్కొనడం ఏమిటి? బండి సంజయ్ దీక్షను అడ్డుకోవడం దేనికి సంకేతం. కేసీఆర్ వ్యవహారంపై కమలం పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే విషయాలపై నాయకులతో నడ్డా కూలంకుషంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సూచనలు, సలహాలు అందించి ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.