నాగార్జున, నాగచైతన్యల ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: బంగార్రాజు
నటీనటులు: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ

2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరి నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
సోగ్గాడే చిన్న నాయన సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే బంగార్రాజు సినిమా కథ మొదలవుతుంది. బంగార్రాజు(నాగార్జున) సత్యభామ(రమ్యకృష్ణ)లు స్వర్గంలో ఉంటారు. అయితే సత్యభామ తమ వంశానికి చెందిన వారసుడు చిన్నబంగార్రాజు(నాగచైతన్య)ను చూడాలని కోరుకుంటుంది. కట్ చేస్తే.. చిన్నబంగార్రాజు నడవడిక అచ్చం బంగార్రాజులాగే ఉంటుంది. ఊరిలోని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అయితే అదే ఊరిలో సర్పంచ్‌గా పోటీ చేసే నాగలక్ష్మీ(కృతి శెట్టి)ని ప్రేమిస్తాడు చిన్నబంగార్రాజు. అయితే వారి ప్రేమకు ఎవరు అడ్డుపడతారు? ఊరిలో జరిగే కొన్ని పరిణామాలాకు చిన్నబంగార్రాజు ఎందుకు కష్టాలపాలవుతాడు? ఈ క్రమంలో బంగార్రాజు చిన్నబంగార్రాజుకు ఎలా సాయపడతాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
సోగ్గాడే చిన్ని నాయన సినిమా చూసిన వారు బంగార్రాజు కథను ఇట్టే ఊహించుకోవచ్చు. అంత సింపుల్ కథను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రాసుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తప్పితే, కథాపరంగా పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. ఇక అసలు కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో చిన్నబంగార్రాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకే ఎక్కువ సమయాన్ని వాడుకున్నాడు చిత్ర దర్శకుడు. ఇక ఊళ్లో అల్లరిచిల్లరగా ఉండే చిన్నబంగార్రాజు ఆ ఊరిలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న నాగలక్ష్మీని చూసి ప్రేమిస్తాడు. అయితే ఆమె ప్రేమను పొందే క్రమంలో ఊళ్లో కొన్ని గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో చిన్నబంగార్రాజు ప్రమాదంలో పడతాడు. ఇక్కడ ఓ ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

అటు సెకండాఫ్‌లో చిన్నబంగార్రాజును ప్రమాదం నుండి కాపాడి, అతడి ప్రేమను గెలిపించేందుకు బంగార్రాజు భూమి మీదకు వస్తాడు. ఇక అసలు కథ ఇక్కడి నుండి మొదలవుతుంది. చిన్నబంగార్రాజు పాత్ర ఒక్కసారిగా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. కట్ చేస్తే.. ఊరిలోని శివాలయానికి సంబంధించిన అంశంలో బంగార్రాజు చిన్నబంగార్రాజుకు ఎలాంటి సాయం చేయలేకపోతాడు. ఈ ప్రమాదం నుండి చిన్నబంగార్రాజు ఎలా బయటపడ్డాడు, చివరకు నాగలక్ష్మీతో అతడి వివాహం ఎలా జరిగిందనే అంశాలతో ఈ సినిమాను ముగించారు.

ఓవరాల్‌గా బంగార్రాజు చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పాలి. రొటీన కథకు విజువల్ ఎఫెక్ట్స్, గ్లామర్ డోస్, కామెడీ, ఎమోషనల్ హంగులను అద్ది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాను కోరుకునే వారికి బంగార్రాజు ఓ ట్రీట్ అని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
బంగార్రాజు పాత్రలో నాగార్జున నటనకు ఏ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఆయన పర్ఫార్మెన్స్ ఉండటం విశేషం. ఇక ఆయన ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్‌గా చేసిన పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాగా నాగచైతన్య పాత్ర సినిమాలో మేజర్ హైలైట్ అని చెప్పాలి. నాగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా చైతూ పాత్రను డిజైన్ చేశారు. అటు రమ్యకృష్ణ పాత్ర కూడా ఎప్పటిలాగే ప్రేక్షకులను మెప్పించగా, కృతిశెట్టి మాత్రం చెలరేగిపోయి నటించేసింది. ఈ సినిమాతో ఆమె క్లాస్ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. రావు రమేష్, వెన్నెల కిషోర్ తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. మిగతా వారు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ కథను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పర్ఫెక్ట్‌గా రాసుకుని ఈ సినిమాను తీసిన విధానం బాగుంది. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా ప్రేక్షకులను సినిమా మొత్తం కట్టిపడేశాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా కలర్‌ఫుల్‌గా ఈ సినిమాలోని సీన్స్‌ను చూపించారు. అటు అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అసెట్. పాటలతో పాటు బీజీఎం కూడా సూపర్బ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
బంగార్రాజు – సంక్రాంతి పండగ రారాజు!

రేటింగ్: 3.5/5.0

Share post:

Latest