బంగార్రాజుకు ఏపీ ఝలక్.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్‌కు కరోనా గడ్డు కాలం ఇంకా ముగియకుండానే వరుసగా దెబ్బమీద దెబ్బ పడుతూ వస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని చాలా సినిమాలు లైన్ కడితే, కరోనా మూడో వేవ్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కారణంగా మరోసారి దేశం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్లీ పంజా విసురుతుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. అయితే ఈ సమయంలో సినిమాలను రిలీజ్ చేయడం సరికాదని భావించిన పలు భారీ పాన్ ఇండియా చిత్రాలు తమ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నాయి.

అయితే ఇదే అదనుగా భావించిన చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు వరుసగా థియేటర్ల బాటపట్టాయి. ఈ జాబితాలో అక్కినేని నాగార్జున నటిస్తున్న బంగార్రాజు చిత్రం కూడా ఉంది. గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్న అక్కినేని నాగార్జున, ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని మనముందుకు తీసుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అతడికి జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని నాగార్జున ఒకటికి రెండుసార్లు చెబుతు వచ్చాడు. అయితే తాజాగా ఆయనకు ఏపీ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జగన్ సర్కార్ ఉన్న పలంగా నైట్ కర్ఫ్యూని విధించింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ నైట్ కర్ఫ్యూ విధింపుతో నాగార్జున బంగార్రాజు భారీగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. నైట్ కర్ఫ్యూ ఉండటంతో రాత్రి షోలు పడటం అసాధ్యం. అంతేగాక కేవలం 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నిర్వహించాలని ఏపీ సర్కార్ ఆదేశించడంతో ఇప్పుడు బంగార్రాజు థియేట్రికల్ రిలీజ్ మరోసారి అయోమయంలో పడింది. జగన్ సర్కార్ సడెన్ డిసిషన్‌తో బంగార్రాజు బయ్యర్లు ఈ సినిమా హక్కుల ధర విషయంలో మళ్లీ నిర్మాతలతో బేరమాడేందుకు రెడీ అయ్యారు. దీంతో ఎంతలేదన్నా, ఈ సినిమాను 40 శాతం తగ్గింపు ధరకు ఈ సినిమా హక్కులు అమ్మాల్సి వస్తుంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బంగార్రాజు చిత్రం రిలీజ్ అవుతుందా లేక ఇతర హీరోలలాగా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Share post:

Popular