తలపట్టుకుంటున్న రేవంత్

తెలుగుదేశం పార్టీలో ఉండి.. చంద్రబాబు అనుచరుడిగా ఎదిగి.. ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన వాగ్ధాటితో రాహుల్ గాంధీని మెప్పించి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పార్టీలో ఇంకా ఫుల్ సపోర్టు లభించలేదు. సరికదా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అయినా సరే.. రేవంత్ అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ముందుకు లాగుతున్నాడు. సభలు, సమావేశాలు, మీడియా మీటింగ్స్ నిర్వహిస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నాడు. ఇలా గడిచిపోతున్న రేవంత్ కు ఇపుడు సరికొత్త సమస్య వచ్చి పడింది.

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు.. రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ నిలదీస్తూ చుక్కలు చూపిస్తోందట. మీరు టీపీసీసీ అధ్యక్షుడైతే..నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు.. పార్టీలో మీరెంతో.. నేనూ అంతే అని గట్టిగా వాదిస్తోందట. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. బయటకు చెప్పుకోలేక రేవంత్ సన్నిహితులతో వాపోతున్నాడట. మహిళా కాంగ్రెస్ నాయకులతో సమావేశం జరిగితే తన పర్మిషన్ తీసుకోవాలని, గాంధీ భవన్ లో జరిగే ప్రతి సమావేశానికి తనకు ఆహ్వానం అందాలని, ప్రతినెలా రూ. 5 లక్షలు మహిళా కాంగ్రెస్ కార్యక్రమాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారట. అంతేకాక సమావేశాల్లో రేవంత్ రెడ్డి వద్దనే తనకు కూడా ప్లేస్ కేటాయించాలని పేర్కొంటోందట. ఇదిలా ఉండగా ఆమె మాట వినని మహిళా నాయకులు, కార్యకర్తలను సస్పెండ్ చేస్తోందని సమాచారం. దీంతో ఇవన్నీ రేవంత్ కు తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. ఈ విషయాపై రేవంత్ రెడ్డి పార్టీ హై కమాండుకు ఫిర్యాదు చేశాడని, ఆమెపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి చెడ్డపేరు వచ్చే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.