ఆ అల‌వాటు వ‌ల్లే `సిరివెన్నెల‌` సినీ ప్ర‌పంచానికి దూర‌మ‌య్యారా?

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌.. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయ‌న అకాల మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సీతారామశాస్త్రికి సగం ఊపిరితిత్తిని తొలగించారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జ‌రిగింది. ఇక తాజాగా మ‌రోసారి క్యాన్స‌ర్‌కు గురికావ‌డంతో.. ఆపరేషన్‌ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తొల‌గించారు. అనంత‌రం రెండు రోజులు బాగానే ఉన్నా.. మెల్ల మెల్ల‌గా ఆయ‌న ఆరోగ్యం విష‌మించి మ‌ర‌ణించార‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

అయితే సిరివెన్నెలకు సిగరెట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్‌ బారిన పడ్డార‌ని, ఆ అల‌వాటు వ‌ల్లే ఆయ‌న సినీ ప్ర‌పంచానికి దూర‌మ‌య్యార‌ని ప‌లువురు అంటున్నారు. అలాగే గ‌తంలో త‌న‌కున్న సిగరెట్ అల‌వాటుపై సిరివెన్నెల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్‌ అలవాటు ఉన్నట్లు వెల్లడించిన సిరివెన్న‌ల‌.. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్ చివ‌ర‌కు వ్యసనంగా మారిందని చెప్పారు.

నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్‌ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని పేర్కొన్నారు.అయితే పబ్లిక్‌ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్‌ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. సిరివెన్నెల మ‌ర‌ణాంత‌రం గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.