పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా జనవరి 12 వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో మిగిలి ఉన్న షూటింగ్ పార్ట్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ఉదయం వికారాబాద్ లోని మదన్ పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఇక్కడ పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్స్ లోకి ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు.. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. పవర్ స్టార్ నినాదంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. చివరగా పవన్ కళ్యాణ్ కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి వెళ్లారు.
కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు.మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ పై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి.