వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ.. పెద్దలు మందలించడంతో..!

వారిద్దరూ వరసకు అన్న చెల్లెలు. ఇద్దరి వయసు తక్కువే. కానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని ఇరు కుటుంబాల దృష్టికి తీసుకెళ్లారు. అన్నాచెల్లెళ్లకు పెళ్లి ఏంటని.. పెద్దలు వారిని మందలించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ జంట చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. అడవిలో వారు మృతి చెందిన 50 రోజుల తర్వాత వారి పుర్రెలు, ఎముకలు మాత్రమే కనిపించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జరిగింది.

వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ బాలిక(15), నాగలాపురం మండలం జంబుకేశ్వర పురానికి చెందిన నరేష్(20) ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. మీరు ప్రేమించుకుంటున్న విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో ప్రేమజంట తమకు వివాహం చేయాలని పెద్దలను కోరింది. వరసకు అన్న చెల్లెలు అవుతారని, పెళ్లి చేయడం ఏంటని వారిని పెద్దలు తీవ్రంగా మందలించారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. కొద్దిరోజుల పాటు వారి జాడ కోసం కుటుంబీకులు వెతికినా తెలియలేదు. ఎక్కడో ఒకచోట ఉంటారని భావించిన వారు ఆ తర్వాత వెతకడం ఆపేశారు. ఈ నేపథ్యంలో కాంబాకం అడవిలో ఇద్దరు మృతదేహాలను పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పుర్రెలు, ఎముకలు మాత్రమే ఉండడంతో వారు మరణించి 50 రోజులు దాటి ఉంటుందని అంచనా వేశారు. అడవిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న దుస్తులను బట్టి చనిపోయింది తమవారేనని నిర్ధారించారు.

Share post:

Latest