అసలే మద్య నిషేధం.. ఆపై అసెంబ్లీ ఆవరణలో మందు సీసాలు..

మద్యం అమ్మకాలు.. ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరు..ఈ లాభాన్ని నమ్ముకొనే కొన్ని రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త వైన్ షాపులు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి.. ఇటీవలే టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నేడో, రేపు కొత్త మద్యం దుకాణలు ఏర్పాటు కాబోతున్నాయి.. వీటి సంగతి పక్కన పెడితే బిహార్ లో ఇపుడు సీఎం నితీష్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్య నిషేధం అమలవుతోంది. మద్య నిషేధం పక్కాగా అమలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సీఎంకు నివేదికల మీద నివేదికలు అందజేస్తూ వచ్చారు. ఓకే.. బ్యాన్ బాగానే అమలవుతోందని నితీష్ హ్యాపీగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కువగా లభిస్తోందని.. పలువురు ప్రాణాలు కూడా పోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధిస్తున్నాయి. వీటిని పెద్దగా పట్టించుకోని నితీష్ కు ఇపుడు నిజంగా షాక్ తగిలింది.

అసెంబ్లీ ఆవరణలోనే మద్యం సీసాలు..

బిహార్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అంతా సవ్యంగా నడిచింది. రెండో రోజు వచ్చే నాటికి మాత్రం అంటే మంగళవారం సర్కారులో కలకలం.. అసెంబ్లీ లోపల, బయటా.. ఎక్కడ చూసినా అదే చర్చ. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు లభించాయని. నిజం.. మద్య నిషేధం అమలవుతున్న రాష్ట్రంలో.. అదీ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మందు బాటిళ్లు లభించడంపై సీఎం అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది తనకు మాయనిమచ్చగా మిగిలిపోతుందని బాధపడ్డారు. మద్య నిషేధానికి కట్టుబడి ఉంటామని ఎన్డీఏ ఎమ్మెల్యేలు అంతకుముందు రోజే ప్లెడ్జ్ కూడా చేశారట. రాష్ట్రంలో పలు చోట్ల 60 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని కూడా మీడియా ఘోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా జరగడంతో నితీష్ కు ఏం చేయాలోపాలుపోవడం లేదు? ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులను ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బ్యాడ్.. వెరీ బ్యాడ్.. దీనిని సహించే పరిస్థితే లేదు. ఇది చిన్న విషయం కాదు.. ఎవరో కావాలనే కుట్ర చేశారు. వారెవరో బయటకు తెలియాలి. అక్కడకు మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? ఈ విషయాలు విచారణలో నిగ్గు తేల్చండి.. లేకపోతే ప్రజల్లో మన పరువు పోతుందని అసహనం వ్యక్తం చేశారు. నిషేధం అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న నితీష్ ప్రభుత్వం ఈ విషయంపై ప్రజలకేం సమాధానం చెబుతారో మరి.