వెనక్కి వెళ్లిన వివేకా హత్య కేసు..!

మామూలుగా అయితే శాసనసభ జరుగుతూ ఉండగా.. ఇటీవలి సంఘటనలను పరిణామాలను అన్నిటినీ బేరీజు వేసుకుంటే వివేకా హత్యకేసపు విషయంలో మాజీ డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు శంకరరెడ్డి అరెస్టు అనే వ్యవహారాలు సభలో అట్టుడికిపోతుండాలి. రాష్ట్రవ్యాప్తంగా కూడా విపక్షాల వారు అందరూ ఆ విషయాల గురించే గోలచేస్తూ ఉండాలి. కానీ ఆ చర్చ మొత్తం హైజాక్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడుకునే ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇతర అంశాలేవీ వారికి తట్టడం లేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా వివేకా హత్య గురించిన చర్చ విస్తృతంగా సాగకుండా ఉండడానికి అధికార పార్టీ వారు వ్యూహాత్మకంగా చంద్రబాబుపై రగడ చేయడం ద్వారా సక్సెస్ అయ్యారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.

చంద్రబాబునాయుడును శాసనసభ సాక్షిగా అవమానించారు. నిజానికి బయట ప్రెస్ మీట్లలో ఇంటర్వ్యూలలో తిట్టే బండబూతులు వేరు.. ప్రజాప్రతినిధులు దైవంలా భావించవలసిన శాసనసభ వేరు. అందుకే సభలో మాత్రమే అన్ పార్లమెంటరీ భాష వాడకంపై నిషేధాజ్ఞలు ఉంటాయి. అయితే భారత రాజకీయాల్లోనే తనదంటూ ఒక ముద్ర కలిగిఉన్న నాయకుడు భావోద్వేగం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని శుక్రవారం కల్పించారు. నిజానికి చంద్రబాబునాయుడు భార్యతో ముడిపెడుతూ నీచమైన వ్యాఖ్యలు.. సుమారు ఇరవైరోజుల కిందటే వినిపించాయి. కానీ అవి బయట చేసిన వ్యాఖ్యలు. సభలో కూడా అవే ప్రస్తావనలు తేవడం తెలుగుదేశాన్ని, చంద్రబాబును రెచ్చగొట్టడమే.

అలా రెచ్చగొట్టడం వ్యూహమే అయితే గనుక.. వైసీపీ దారుణంగా సక్సెస్ అయినట్టు లెక్క. ఆ కామెంట్స్ దెబ్బకి తెలుగుదేశం వారు ప్రభుత్వం చేయడానికి ప్రిపేర్ అయిన విమర్శలు, వివేకా హత్యపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్న వైనం అన్నీ మరచిపోయారు. చంద్రబాబు ఏడ్చే దాకా పరిస్థితి వెళ్లడం ఇతర అంశాలు మరుగున పడ్డాయి.

శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దుడుకుతనం కనిపించింది. యథాలాపంగా ఏ ఒక్కరో అనడం కాదు.. అందరూ పని గట్టుకుని.. అదే టాపిక్ మీద గలీజు మాటలు మొదలెట్టారు. అందరూ మూకుమ్మడిగా మాట్లాడుతున్నందునే.. అదతి వ్యూహమా అనే అభిప్రాయం కలుగుతుంది.

వివేకా హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి.. గట్టి ఆధారాలు సీబీఐకు దొరికిన తర్వాత.. ఇవాళ రాష్ట్రమంతా అదే సంగతి మాట్లాడుకుంటోంది. ఈకేసులో పాత్రధారిగా అరెస్టు అయిన శంకరరెడ్డిని పులివెందుల కోర్టు వద్ద స్వయంగా వెళ్లి కలిసి అవినాష్ రెడ్డి మరింతగా హాట్ టాపిక్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించి.. ఇంకో కొత్త రాద్ధాంతాన్ని తెరపైకి తేవడానికి వైసీపీ కుట్రపూరితంగా, పనిగట్టుకుని చంద్రబాబు మీద ఇలాంటి వ్యాఖ్యలకు దిగజారిందా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబునాయుడి కన్నీళ్ల గురించే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. వివేకా హంతకుల గొడవ మసకబారింది. బాబు కన్నీళ్ల వల్ల కొంత నష్టం ఉంటే ఉండొచ్చు గాక.. కానీ వివేకా గొడవ మీద నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లిపోవడం వారికి లాభమే.