సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండించారు.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని కఠినంగా హెచ్చరించారు.

కాగా భువనేశ్వరి పట్ల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్టీఆర్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడిన తీరు పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఎన్టీఆర్ పరిణతితో మాట్లాడారని అంటుండగా.. సొంత మేనత్త పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే స్పందించేది ఇలాగా.. అని మరి కొందరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఇవాళ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

నారా భువనేశ్వరి పై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే హరికృష్ణ బతికి ఉంటే నేరుగా రంగంలోకి దిగిన రచ్చ రచ్చ చేసి ఉండేవారని అన్నారు. ఎన్టీఆర్ ఆ విధంగా ఎందుకు చేయలేకపోయారో అర్థం కాలేదన్నారు. భువనేశ్వరి మీ నాన్న చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా.. మీ మేనత్త పట్ల అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఇలాగేనా స్పందించేది..అంటూ నిలదీశారు.

ఎన్టీఆర్ అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ కి భయమని ఆయన వార్నింగ్ ఇచ్చి ఉంటే వాళ్లు తోకలు ముడుచుకొని పోయేవారని అన్నారు. ఎన్టీఆర్ సింహాద్రిలా వస్తాడు అనుకుంటే..చాగంటిలా వచ్చి ప్రవచనాలు చెప్పాడని, ఎన్టీఆర్ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వుతున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వర్ల రామయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Share post:

Latest