పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు సాధించి పరువు పోగొట్టుకుంది. ఈ ఓటమికి గల కారణాలను అధిష్టానం విశ్లేషించింది.. టీకాంగ్రెస్ నాయకులకు క్లాస్ కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి.. డిపాజిట్లు రాకుండా ఓడిపోయి..మళ్లీ పరువు ఎందుకు పోగొట్టుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీలో కొందరి నాయకుల వాదన. అలా అంటే.. మరి పోటీచేయాలనుకున్న వాళ్లు ఏమైపోతారు? అందుకే.. అసలు ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అనేది ఈ రోజు (మంగళవారం) కాంగ్రెస్ పెద్దలు నిర్ణయిస్తారు. సాయంత్రం 6 గంటలలోపు ఏ విషయం చెబుతారు.

పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని కన్వీనర్ షబ్బీర్ అలీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. అందులో పలువురు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు.. స్థానిక నాయకులతో మాట్లాడి చెబుతామని పేర్కొన్నారు. ఊరికే పోటీచేసి ఓడిపోవడం ఎందుకు.. పరువు పోగొట్టుకోవడం ఎందుకని వీహెచ్ అభిప్రాయపడ్డారు. అయితే.. ఇంతవరకు దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకవేళ పోటీచేయకూడదని పార్టీ.. భావిస్తే ఆశావహులు ఇండిపెండెంట్గా అయినా పోటీచేస్తారు. వారికి ఎలాగూ పార్టీ నాయకుల నుంచి సపోర్టు ఉంటుంది. అయితే ఆ లెక్క పార్టీ ఖాతాలోకి అధికారికంగా రాదు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 10న జరుగునున్నాయి. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. 12 స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు నామినేషన్లు ఈనెల 16 నుంచి 23 వరకు స్వీకరిస్తారు.