మల్లెమాలకు పూలమాల వేస్తున్న సుడిగాలి సుధీర్.. నిజమేనా?

తెలుగు బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా జబర్దస్త్ తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షోను కూడా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు కామెడీ షోలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇప్పుడు జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్ అనే రేంజ్‌కు ఆయన క్రేజ్ వెళ్లిపోయింది. కేవలం సుధీర్ చేసే స్కిట్స్ కోసమే చాలా మంది జబర్దస్త్ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్‌ను అమాంతం ఆకాశానికి తీసుకెళ్లిన ఈ షోకు ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షోలో ఇకపై సుడిగాలి సుధీర్ కనిపించడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జబర్దస్త్ నిర్మాతలు అయిన మల్లెమాల వారు ప్రతియేటా కమెడియన్స్‌తో అగ్రిమెంట్లు చేయించుకుంటారు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్ ముగియడంతో, మరోసారి అగ్రిమెంట్ చేసేందుకు సుధీర్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.

గతంలో సుడిగాలి సుధీర్‌కు కేవలం జబర్దస్త్ మాత్రమే ఆధారం. కానీ ఇప్పుడు ఏ ఛానల్‌లో అయినా సుధీర్ క్రేజ్ అలాగే ఉండటం, సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు వస్తుండటంతో ఈసారి మల్లెమాల వారి అగ్రిమెంట్‌కు సుధీర్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుండి బయటకు వచ్చేస్తే, ఆయనతో పాటు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు కూడా బయటకు వచ్చేస్తారు. మరి ఈ గ్యాంగ్ లేకుండా జబర్దస్త్ తన టీఆర్పీ రేటింగ్స్‌ను నెట్టుకురావడం కష్టమే అంటున్నారు ఈ షోను వీక్షించేవారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest