కొత్త బిల్లు కోసం ఢిల్లీ స్పెషలిస్టులకు పిలుపు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అనే లక్ష్యంతో మూడు రాజధానులు పెట్టి తీరుతానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలను శాసనసభ సాక్షిగా ప్రకటించేశారు. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏ బిల్లు మీద అయితే హైకోర్టులో విచారణ జరుతున్నదో ఆ బిల్లును రద్దు చేశారు. దానితో పాటు సీఆర్డీయేను పునరుద్ధరించారు. న్యాయపరమైన లొసుగులు లేకుండా కొత్త బిల్లు రూపొందించి సభ ముందుకు తెస్తా అని ఆయన ప్రకటించారు.

ఇప్పుడు లోపభూయిష్టమైన రాజధాని వికేంద్రీకరణ బిల్లును కొత్తగా తయారుచేయడానికి కసరత్తు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న బిల్లు న్యాయస్థానం ఎదుట దొరికిపోయేలాగా తయారైన వైనంపై జగన్మోహన్ రెడ్డికి అసహనం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున వాదించడానికి వచ్చిన న్యాయవాదులే.. ఈ బిల్లు ఉన్న రూపంలో న్యాయస్థానంలో నెగ్గడం అసాధ్యం అని నిర్ణయించాకే ఈ వెనకడుగు పడింది.

అలాగే.. ఇప్పుడు కొత్త బిల్లు తయారైనా కూడా.. తక్షణమే అది చట్టం రూపంలోకి వచ్చేసినా కూడా.. దానిమీద కొత్తగా కోర్టు కేసులు నమోదు కావనే గ్యారంటీ లేదు. హైకోర్టులో మిస్సయితే మళ్లీ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధమే గానీ.. ఓడిపోతాం అనే భీతితో వెళ్లే పరిస్థితి ఉండకూడదనేది జగన్ కోరిక. అందుకే వికేంద్రీకరణకు సంబధించిన సరికొత్త బిల్లును.. చాలా చాలా పటిష్టంగా తయారుచేయాలని ఆలోచిస్తున్నారు.

సుప్రీం కోర్టు న్యాయవాదుల్లో ఉద్ధండులు, కొమ్ములు తిరిగిన రాజ్యాంగ నిపుణులను సంప్రదించి.. వారి ద్వారా.. ఎలాంటి లొసుగు లేకుండా కొత్త బిల్లు చేయంచాలని కసరత్తు జరుగుతోంది. గతంలో బిల్లు తయారు చేసిన వారికి చేతకాదనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు సమాచారం. అందుకనే చట్టాలు, వాటిలో లొసుగులు, రాజ్యాంగం యొక్క ఆనుపానులు తెలిసిన మహామహుల్ని ఢిల్లీనుంచి పిలిపించనున్నారు.

ఈసారి ఎలాంటి చిక్కులు రాకుండా బిల్లు తయారు చేయాలనేది ప్లాన్. ఎంత ఖర్చయినా.. ఎంత లేటైనా పక్కాగా చేయాలని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సుప్రీం కోర్టు సీజేగా ఎన్వీరమణ రిటైర్ అవుతారు. ఆలోగా కొత్త బిల్లు తీసుకువస్తే.. ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా.. పరవాలేదని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.