పబ్లిసిటీ చేయొద్దు..శివశంకర్ మాస్టర్ వైద్యానికి కోలీవుడ్ స్టార్ హీరో సాయం..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో బాధపడుతూ హైదరాబాదులోని ఏజీఐ ఆస్పత్రిలో గత ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయన కుమారుడు కూడా కరోనాతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తన తండ్రి వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతున్నట్టు శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు ప్రకటించి ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరాడు.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ శివ శంకర్ మాస్టర్ వైద్యానికి సహాయం అందిస్తానని తెలిపాడు. వారి కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడి ధైర్యం చెప్పాడు. కాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ వైద్యానికి గాను ఆయన కుటుంబ సభ్యులకు రూ.పది లక్షలు అందజేసినట్లు సమాచారం. అయితే తాను సహాయం చేసినట్లు ఎక్కడ పబ్లిసిటీ చేయవద్దని ఆయన కోరినట్లు తెలుస్తోంది.

సైలెంట్ గా సహాయం చేసి తన పేరు కూడా బయట చెప్పవద్దని ధనుష్ కోరడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి. కాగా శివ శంకర్ మాస్టర్ టాలీవుడ్ లో వందలాది సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు. ఆయన విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సాయం అందించడం పై నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తూనే టాలీవుడ్ హీరోలు ధనుష్ ని చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest