జగన్: నిన్న బుకాయించి.. నేడు దొరికిపోయారు..!

జగన్ మడమ తిప్పని నాయకుడు అని ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆయన అంతే దృఢంగా మొండిగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం మారుతోంది. జగన్ తరహా కూడా మారుతోంది. తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తించే తీరు కూడా మారుతోంది. మడమ తిప్పుతున్నారు.. అందులో ఏమీ సదేహం లేదు. అయితే నిన్న ఈ విషయంలో బుకాయించేలా పార్టీ వాళ్లు ఏదో కొంత సమర్థించుకున్నారు గానీ.. నేడు అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ రాష్ట్రమతా జగన్ మడమ తిప్పడం గురించే మాట్లాడుకుంటోంది.

శాసనమండలిని జగన్ సర్కారు 2019లోనే రద్దు చేసింది. ఆ సభలో తమ పార్టీకి ఆ సమయంలో బలం లేదు గనుక.. తాము తీసుకునే నిర్ణయాలు అక్కడ చెల్లకపోవచ్చు గనుక.. మండలి మీద ఆయనకు కోపం వచ్చింది. తలనొప్పి వస్తే మందువేయడానికి బదులు.. తల నరికేసుకున్నట్లుగా ఆయన మండలిని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ ఆమోదించింది.

అదే సభలో ఇవాళ ఆయన పార్టీకి మెజారిటీ బలం ఏర్పడింది. అప్పట్లో మండలిని రద్దు చేసిన తీర్మానం ఇంకా కేంద్రం వద్ద పెండింగులో ఉంది. ఆ మిష చెప్పి.. దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇంకో కారణం లేదు. జగన్ మడమ తిప్పారనే సంగతి అచ్చంగా అందరికీ అర్థమైపోయేలా చేసిన నిర్ణయం ఇది.

నిజానికి మూడు రాజధానుల బిల్లు రద్దు, సీఆర్డీయే రద్దు బిల్లు- రద్దు.. ప్రకటనలు చేసినప్పుడు జగన్ మడమ తిప్పారు. న్యాయస్థానం వద్ద పరాభవం ఎదురవకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లు కొత్తగా మళ్లీ తెస్తానంటూ – అది మడమ తిప్పడం కాదన్నట్టుగా కొంత బిల్డప్ ఇచ్చారు. ఆ ముసుగులో సీఆర్డీయే విషయంలో మడమతిప్పడం కూడా జనానికి అర్థం కాలేదు. కొత్త బిల్లు రాగానే సీఆర్డీయే ఏమవుతుందోననే సస్పెన్స్ మిగిలింది.

కానీ ఇవాళ మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. ఇక బుకాయించడానికి ఏమీ లేదు. మడమ తిప్పినట్టుగా అడ్డంగా దొరికిపోయారు. ‘ఒకప్పటి పరిస్థితులు’ అని బుగ్గన చెప్పుకొచ్చారు.. నిజానికి ఒకప్పటిక పరిస్థితులు అంటే అప్పటి వారి ఆవేశపూరిత ఆలోచన నిర్ణయాలు మాత్రమే అని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.