ఎగసిపడిన సంతోషం.. అంతలోనే దుఃఖం..!

అమరావతి రాష్ట్రం కోసం పోరాడుతున్న రైతులు సోమవారం నాడు రెండు రకాల భావోద్వేగాలకు గురయ్యారు. ఒక ప్రకటన రాగానే.. తాము అపురూపమైన విజయం సాధించేశాం అని మురిసిపోయారు. పండగ చేసేసుకున్నారు. స్వీట్లు తినిపించేసుకున్నారు. ఒక్క అమరావతి రైతులు మాత్రమే కాదు.. వారి వెనుక నుంచి నడిపిస్తున్నారనే ముద్రను ఎదుర్కొంటున్న తెలుగుదేశం వారు కూడా రాష్ట్రంలో పలు చోట్ల స్వీట్లు తినిపించుకున్నారు. అయితే అంతలోనే.. అతి తక్కువ సేపటికే సీన్ మారిపోయింది. మోదం స్థానే ఖేదం వచ్చింది. సంతోషం ఆవిరైపోయి.. మళ్లీ దుఃఖంలో పడ్డారు.
సోమవారం నాడు- మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు, సీఆర్డీయే రద్దు బిల్లును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ లాయరు హైకోర్టులో ప్రకటించగానే రాష్ట్రంలో రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. జగన్ ఈ విషయంలో కాసేపట్లో అసెంబ్లీ లో ప్రకటన చేస్తారనే సమాచారం మాత్రం తొలుత బయటకు వచ్చింది. ఆ వెంటనే రాష్ట్రమంతా పెద్ద సంచలనం రేగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్లూ మూడు రాజధానులకు అనుకూలంగా పెద్దఎత్తున వాదనలు వినిపించిన వారు.. చిన్న గ్రామాలవరకు అదే కరెక్టని వాదించిన వారు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఖంగుతిన్నారు. జగన్ వ్యూహం ఏమిటో అప్పటికి ఎవ్వరికీ తెలియలేదు. మరోవైపు అమరావతి అనుకూల వాదులు, తెలుగుదేశం వారు అంతా పండగ మూడ్ లోకి వెళ్లిపోయారు. సెలబ్రేషన్ చేసుకోవడం మాత్రమే కాదు.. జగన్ మీద నిందలు కూడా ప్రారంభించేశారు. ఓడిపోయాడని ఎద్దేవా చేయడం కూడా ప్రారంభించారు. అయితే ఇలాంటి హడావుడి ఆనందం మొత్తం వారికి చాలా కొద్ది సమయం మాత్రమే దక్కింది. ఈలోగా జగన్ శాసనసభలోకి వచ్చి పెదవి విప్పారు.
మూడు రాజధానులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడ ఉంటుందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అని విస్ఫష్టంగా తేల్చేశారు. ఈ బిల్లులో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నందున.. దీన్ని రద్దుచేసి మరింత పటిష్టమైన మరింత సమగ్రమైన బిల్లు త్వరలోనే తీసుకువస్తాం అని వెల్లడించారు.
దీంతో అప్పటిదాకా కొన్ని గంటల పాటు ఏర్పడిన వాతావరణం మారిపోయింది. సీన్ రివర్స్ అయింది. మిఠాయిలు తినిపించుకుంటున్న వారంతా.. నోరెళ్ల బెట్టారు. పరువు దక్కిందని వైసీపీ వారు మిన్నకున్నారు. కానీ రైతలకు మాత్రం.. గంటల వ్యవధిలోనే మోదం- ఖేదం తప్పలేదు.