నిర్ణయం పాతదే అయినా.. ఉన్నట్టుండి తెరపైకి..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎవరికీ అంతుపట్టవు.. అందులోని అంతరార్థమూ అర్థం కాదు.. అలా అని అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయరు. కనీసం అడగాలనే ఆలోచన కూడా వారికి రాదు. అందుకు ఓ ఉదాహరణే.. రాజధాని మార్పు. మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్లీ వస్తామని అసెంబ్లీలో చెప్పేంతవరకు ఎమ్మెల్యేలకే తెలియదు. అంతెందుకు మంత్రి వర్గ సమావేశంలో జగన్ తన సహచరులకు వివరించేంతవరకు వారికి కూడా తెలియదు. విధానపరమైన నిర్ణయాలను జగన్ సీక్రట్ గా ఉంచుతూ సడన్ గా రివీల్ చేస్తున్నాడు. ఇపుడు మరో విషయంపై నేరుగా అధికారులకే చెప్పేశాడు. అదే.. జిల్లాల పునర్విభజన. ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనేది పాత నిర్ణయమే. 2020లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్ తో పాటు పరిపాలన నిర్ణయాల వల్ల జిల్లాల విభజన మరుగునపడిపోయింది. అయితే ఉన్నట్టుండి జిల్లాల విభజన చేయాలని అదీ 2022 జనవరిలోపు పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో అధికారుల్లో షాక్.. ఉన్నట్టుండి విభజన అంటే ఎలా? దానికీ ఓ పద్ధతుంది? ఫాలో కావాలి కదా అనేది వారి వాదన. అయితే ఈ సంగతిని సీఎంకు మాత్రం చెప్పలేరు. సరే..సార్ అనడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. ఏపీలో జిల్లాల సంఖ్యను 26 చేయాలని సీఎం భావిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కొత్త జిల్లాలను కేసీఆర్ చేసినట్లు తాను కూడా చేసి చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నారేమో.. అందులోని మర్మం ఆయనకే ఎరుక. మరి అధికారులు ఈ ఆదేశాలను ఎలా పాటిస్తారో? పునర్విభజన ఎలా చేస్తారో? ఉన్న అతి తక్కువ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో? రెండు నెలలు ఆగితే తప్ప అర్థం కాదు.

Share post:

Latest