కేసీఆర్ వర్సెస్ ఈటల ..మధ్యలో రవీందర్..

హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఈటల మరింత చురుగ్గా ముందుకు వెళుతున్నారు. నన్ను.. అన్యాయంగా శిక్షించారు.. అవమానకరంగా పార్టీనుంచి బయటకు పంపారనేది ఈటల భావన. ఈ ఫీలింగును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టి ప్రయోజనం పొందాలనేది ఈటల ప్లాన్. అందులో భాగంగానే ప్లాన్ అమలు చేసి హుజూరాబాద్ లో సక్సెస్ అయ్యారు. ఇపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చాటి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈటల ఫోకస్ చేశారు.

కోట్ల రూపాయల డబ్బు ఖర్చుపెట్టి.. మంత్రులందరినీ హుజూరాబాద్ పంపించి తనకు వ్యతిరేకంగా పనిచేయించినా తాను గెలిచానని ఈటల చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒక సీటుకు మాత్రం టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ నామినేషన్ వేశారు. రవీందర్ సింగ్.. కరీంనగర్ మునిసిపాలిటీకి మేయర్ గా పనిచేశారు. అయితే మేయర్ పదవీ కాలం ముగిసిన తరువాత తనకు ఎటువంటి పదవులు ఇవ్వలేదని రవీందర్ కేసీఆర్ పై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటైనా కేటాయిస్తారని భావించారు. అయితే ఆయనకు సారు మొండిచేయి చూపారు.

దీనినే ఈటల తనకు అవకాశంగా మలుచుకున్నారు. మరి అదే కదా రాజకీయం అంటే. రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీని వీడేలా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఈటల ఈ ఎన్నికల్లో దాదాపు రూ.10 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలిసింది. తన మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులను కరీంనగర్ కు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పొరపాటున టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టమని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు. ఎలాగైనా గెలచుకొని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈటల కూడా అదే పట్టుదలతో ఉన్నాడు. మరి విజయం ఎవరిని వరిస్తుందో?