దృశ్యం 2, విరాటపర్వం సినిమాల విడుదల విషయంలో సురేష్‌బాబు కీలక నిర్ణయం..?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు తెలివైన వ్యాపారవేత్తగా ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఆయనకు సినిమాను ఎప్పుడు.. ఏ సమయానికి రిలీజ్ చేయాలనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ప్రస్తుతం విరాటపర్వం, దృశ్యం 2 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సురేష్ బాబు చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఓటీటీలో విడుదల చేయాలా లేదా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలనే అంశంపై ఆయన తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా కాలంలో ఓటీటీ సంస్థలు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కరోనా ముందు నాటి సమయంలో సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీ సంస్థల్లో రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీ వేదికగానే బడా హీరోల సినిమాలు సైతం విడుదలవుతున్నాయి. అలాగే థియేటర్లలో రిలీజై హిట్టయిన సినిమాలూ నెలరోజుల్లోపే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇందుకు ఆయా స్ట్రీమింగ్ సంస్థలు భారీ మొత్తంలో డీల్స్ ఆఫర్ చేయడమేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దృశ్యం 2 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం.

కానీ సురేష్ బాబు మాత్రం లవ్ స్టోరీ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి తన దృశ్యం 2 ఓటీటీ డీల్స్ ను పునఃసమీక్షించుకుంటున్నారట. అలాగే విరాటపర్వం సినిమాని కూడా థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు మరింత మంచి డీల్స్ ఆఫర్ చేయడంతో రెండు సినిమాలను సైతం ఓటీటీలోనే విడుదల చేయాలని ఓ తుది నిర్ణయానికి వచ్చారని వినికిడి. కాగా అధికారికంగా సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.