మరో ఫేమస్ నవల పట్టిన క్రిష్.. ఈసారి స్టార్ హీరో కాంబినేషన్ లో ..!

ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించేందుకు కథల కొరత తీవ్రంగా ఉంది. మంచి కథ దొరికితే కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా చిరంజీవి లాంటివారు సిద్ధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కథలు సరైనవి దొరకకేనే తమిళ్, హిందీ, మలయాళంలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఫేమస్ నవలల ఆధారంగా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నవల ఆధారంగా సినిమా తీయడం తక్కువే కానీ 80స్ లో చిరంజీవి, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలు ఎన్నో చిత్రాల్లో నటించారు. విజయాలు కూడా అందుకున్నారు.

త్రివిక్రమ్ కూడా అఆ సినిమాను మీనా నవల ఆధారంగా తీశాడు. ప్రస్తుతం క్రిష్ కూడా తన కొండపొలం సినిమాను ‘కొండ పొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవనుంది. కాగా క్రిష్ మరో నవలను కూడా సినిమాగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. రాయలసీమలో పేరుగాంచిన నవలా రచయిత కేశవరెడ్డి రచించిన ‘అతడు అడవిని జయించాడు’ అనే నవలను విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్రిష్ చేస్తున్న కొండపొలం మూవీ పూర్తవడంతో మధ్యలో షూటింగ్ ఆగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టనున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత వెంకటేష్ తో సినిమా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.