కారులో పదవుల పండగ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..

September 15, 2021 at 4:34 pm

తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీలో అందరినీ సంతృప్తి పరచేందుకు ప్లాన్ రూపొందించింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో కేడర్ ను కాపాడుకునేందుకు పదవుల పంపకం ప్రారంభించింది. ఇన్ని రోజులు పార్టీపై లేని శ్రద్ద ఉన్నట్టుండి రావడంతో కేవలం ఎన్నికల కోసమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం పార్టీ సమావేశంలో కేటీఆర్ చేసిన ఓ కామెంట్ తో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వబోమని కేటీఆర్ ఖరాఖండిగా చెప్పేశాడు. అంటే.. వారు నియోజకవర్గానికే పరిమితం కావాల్సిందే అని అర్థం. జిల్లా పార్టీపై పట్టు సాధిద్దామని అనుకునే వాళ్లకు ఈ నిర్ణయం నిరాశను మిగిల్చింది. లేదు..కాదు మాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే అని ఎమ్మెల్యేలు పట్టుబడితే .. వారిని రాజీనామా చేయాలని అధిష్టానం కోరే అవకాశముంది.

దీంతో ఆ ప్రతిపాదనకు కూడా ఎమ్మెల్యేలు ఒప్పుకోకపోవచ్చు. రెండేళ్ల పదవీ కాలాన్ని ఎలా వదులుకుంటారు. ఇక గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి ఓటు బ్యాంకును పెంచుకోవాలని కారు పార్టీ అధినేత ఇప్పటినుంచే పథకాలు రూపొందిస్తున్నారు. అందులో భాగమే ఈ పదవుల పందేరం. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు మూడేళ్లవుతోంది. అక్కడక్కడా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా అసంతృప్తిగా ఉన్నారు. బయట నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారు.. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు ఇంకా జెండా మోస్తూనే ఉన్నారు కానీ.. ఎక్కడా ప్రయోజనం పొందలేదనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంది. దీనిని రూపుమాపడానికే పదవులు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం.

కారులో పదవుల పండగ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..
0 votes, 0.00 avg. rating (0% score)