నిరుద్యోగులకు షర్మిల బంపరాఫర్…

డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురు తెలంగాణలో పార్టీ (వైటీపీ) ప్రారంభించిన తరువాత కాస్త చురుగ్గానే ముందుకు వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ కూతురిగా తెలంగాణలో రాజకీయ భవితవ్యం తేల్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగ సమస్యను భుజానెత్తుకున్నారు. నిరుద్యోగులకు బాసటగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు సంఘీభావంగా ప్రతి మంగళవారం వారింటి వద్ద దీక్ష చేపడుతున్నారు. ఇపుడు మరో అడుగు ముందుకు వేసి హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీచేయాలని, పోటీచేసే వారికి తమ పార్టీ అండగా ఉంటుందన, సహాయ,సహకారాలందిస్తామని చెప్పారు.

ప్రత్యేకంగా సమన్వయకర్త నియామకం

త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీచేస్తే వారికి పార్టీ తరఫున సహకారాలందించేందుకు ప్రత్యేకంగా ఓ సమన్వయకర్తనే నియమించారు షర్మిల. సిద్దిపేట జిల్లాకు చెందిన బొమ్మ భాస్కర రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించింది. నామినేషన్ కార్యక్రమం మొదలు ప్రచారం వరకు పార్టీనే చూసుకుంటుందని షర్మిల హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఆందోళన చేస్తుండటంతో ఈ అంశం పార్టీకి ఉపయోగపడేలా ప్లాన్ రూపొందించారు. మరి షర్మిల ఇచ్చిన ఆఫర్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో, నిరుద్యోగులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.