సీబీఐ గడప తొక్కిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి కాస్త దూకుడు పెంచాడు. టీఆర్ఎస్, కేసీఆర్ పై రోజురోజుకూ విమర్శలు చేస్తూ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచుతున్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇదో పెద్ద కుంభకోణమని బహిరంగంగనే అనేక విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి. ప్రతి సభలోనూ, మీడియా సమావేశాల్లోనూ కోకాపేట వ్యవహారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా లాభపడేందుకే ఈ వేలం వ్యవహారాన్ని తీసుకొచ్చిందని, ప్రభుత్వ భూమిని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు.

దీనిపై కారు పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు. ఒకరిద్దరు నాయకులు రెండు, మూడు రోజుల పాటు రేవంత్ ను విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ తో ఢీ అనే స్థాయికి వెళ్లారు. ఆ గొడవ ఇపుడు సద్దుమణిగింది అని అనుకునే లోపే రేవంత్ సీబీఐ గడపను తొక్కారు. తెలంగాణలో కోకోపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని సీబీఐ డైరెక్టర్ కు ఢిల్లీలో ఫిర్యాదు చేశాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో కాస్త కలకలం రేగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీ నాయకులను స్పందించాలని కోరాడు. అయితే బండి సంజయ్ టీమ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. మనకెందుకులే .. మనం స్పందిస్తే కాంగ్రెస్ పార్టీతో కమలం జట్టు కట్టినట్టు ఉంటుందని వారు పట్టించుకోలేదు. అయినా రేవంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా కోకోపేట కథను ఢిల్లీకితీసుకెళ్లాడు. మరి కేంద్ర ప్రభుత్వం సీబీఐ కు ఏమని డైరెక్షన్ ఇస్తుందో, అసలు విచారణ జరుపుతుందో, లేదో అనేది వేచి చూడాలి.