నితిన్ మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా.. మాస్ మూవీ హిట్ ఇచ్చేనా..!

తేజ దర్శకత్వంలో 2002లో విడుదలైన సినిమా జయం. ఈ సినిమా ద్వారానే నితిన్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ తర్వాత ఆయన హీరోగా నటించిన రెండో సినిమా దిల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సై మూవీ వరకూ నితిన్ సినీ ప్రస్థానం బాగానే సాగింది. ఆ తర్వాత నుంచి ఆయన కెరీర్ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.అందుకు కారణం నితిన్ తీసుకున్న నిర్ణయాలే.

నితిన్ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారీ అపజయాలను ఎదుర్కొన్నాడు. అలాగే లవ్ స్టోరీ చేసిన ప్రతిసారీ విజయాన్ని అందుకున్నాడు. 2004లో విడుదలైన సై సినిమా తర్వాత నితిన్ వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేశాడు. సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. అప్పట్నుంచి నితిన్ 2012 వరకు విజయం అందుకోలేకపోయాడు. ఆ ఏడాది నితిన్ హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం ఇష్క్ భారీ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా నితిన్ కు ప్రేమ కథా చిత్రాలే నప్పుతాయని మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన నటించిన మరో లవ్ స్టోరీ గుండెజారిగల్లంతయ్యిందే కూడా మంచి విజయం అందుకుంది.

రెండు విజయాల తర్వాత నితిన్ మళ్ళీ రాంగ్ స్టెప్ వేసాడు. ప్రయోగాత్మకంగా కొరియర్ బాయ్ కల్యాణ్ మూవీ చేశాడు. అప్పటి నుంచి మళ్లీ నితిన్ ను పరాజయాలు పలకరించాయి. 2016లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమా నితిన్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వెంటనే నితిన్ లై సినిమాతో మరో ప్లాప్ అందుకున్నాడు. మళ్లీ 2020 లో గానీ భీష్మ తో నితిన్ కు విజయం అందలేదు.

ఇక అప్పట్నుంచీ అయినా నితిన్ సరైన ప్లానింగ్ చేసుకుంటాడని భావించినా చెక్ వంటి ప్రయోగాత్మక సినిమాతో వెనువెంటనే పరాజయం అందుకున్నాడు. ఇప్పుడు రంగ్ దే మూవీ తర్వాత నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే మాస్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. నితిన్ మాస్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ప్రతిసారీ పరాజయాలే ఎదుర్కొన్నాడు. మరి ఈసారైనా నితిన్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Share post:

Latest