పంజాబ్ విజయంపై అనుమానాలే లేని వేళ.. ఈ మతలబు ఏంటీ? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా..!

ఐపీఎల్ లో భాగంగా దుబాయ్ వేదికగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విజయం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన పంజాబ్ అనూహ్యంగా చివరి రెండు ఓవర్లలో కుప్పకూలింది. విజయం ఖాయం అని అందరూ అనుకున్నవేళ అనూహ్యంగా పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ గతంలో మాదిరి మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ కు ఏమైనా పాల్పడిందా అనే అనుమానాలు క్రికెట్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు ఎవిన్​ లూయిస్ (36; 21 బంతుల్లో 7×4, 1×6), యశస్వి జైస్వాల్​ (49; 36 బంతుల్లో 6×4, 2×6) అదరగొట్టారు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్ రాహుల్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67) మంచి శుభారంభాన్ని అందించారు.

వారిద్దరూ ఏకంగా తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటయినప్పటికీ
నికోలస్ పూరన్(32), ఎయిడెన్ మార్క్‌రమ్(26 నాటౌట్) జోరు కొనసాగించారు. దీంతో పంజాబ్ విజయం ఖాయమని కామెంటర్లు కూడా వ్యాఖ్యానించారు. నిర్ణీత ఓవర్ల కంటే ముందే పంజాబ్ మ్యాచ్ ముగిస్తుందని కూడా అన్నారు.

చివర్లో పంజాబ్ 12 బంతుల్లో 8 రన్స్ చేయాల్సి ఉండగా.. క్రీజ్ లో భారీ హిట్టర్లు ఉండటంతో పంజాబ్ గెలుపుపై ఎవరికీ అనుమానాలు లేవు.
కానీ 19వ ఓవర్లో బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా కార్తీక్ త్యాగి బౌలింగ్ కు వచ్చాడు. తన మొదటి బంతిని డాట్ బాల్‌గా వేయగా, రెండో బంతికి మార్క్రామ్ సింగల్ తీశాడు. మూడో బంతికి నికోలస్‌ పూరన్‌ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా (0) నాలుగో బంతికే పరుగులేమి చేయలేదు. ఐదో బంతికి డకౌటయ్యాడు.

ఒక బంతికి మూడు పరుగుల చేయాల్సిన పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన ఫాబియన్ అలెన్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. నికోలస్ పూరన్, మార్క్‌రమ్ లకు హార్డ్ హిట్టర్లుగా పేరు ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో వాళ్ళు ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఇక చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన దీపక్ హుడా కూడా అలవోకగా సిక్స్ లు బాదే నైపుణ్యం ఉంది.

ఇక చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన అలెన్ కనీసం సింగిల్ తీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు గతంలో ఓసారి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందనే అనుమానాలతో రెండేళ్లపాటు ఐపీఎల్ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మరోసారి రాజస్థాన్ అలాంటి చర్యలకే పాల్పడిందా.. అని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.