వలలో చిన్న చేపలు.. చిక్కు మాత్రం పెద్ద చేపకే

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో భారీ కుంభకోణంగా జగన్ సర్కార్ అభివర్ణిస్తున్న.. ఫైబర్ నెట్ కేసులో చిన్న చేపలు దాదాపుగా వలకు చిక్కినట్టే. హరిప్రసాద్, సాంబశివరావు తదితరులను అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. తమమీద వినిపిస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ.. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగనే లేదని వారు చెబుతున్నప్పటికీ, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వాళ్ళు ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తోంది.  ప్రస్తుతానికి విచారణ ఎదుర్కొంటున్నది ఎవరు అనే సంగతి పక్కన పెడితే.. ఈ విచారణ ద్వారా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది మాత్రం నారా లోకేష్ నే అని తెలుస్తోంది. ఫైబర్ నెట్ కుంభకోణానికి అసలు సూత్రధారి నారా లోకేష్ అని వైసీపీ నాయకులు పదేపదే చెబుతూ వస్తున్నారు.

- Advertisement -

చంద్రబాబునాయుడు హయాంలో.. ఏపీలో మారుమూల గ్రామాలతో సహా ఇంటింటికీ వైఫైతో ఇంటర్నెట్ సదుపాయం, కేబుల్ టీవీ అన్నీ గంపగుత్తగా అత్యంత చవకగా అందిస్తున్నాం అనే హామీతో.. ఏపీ సర్కారు ఫైబర్ నెట్ ప్రాజెక్టు చేపట్టింది. తొలిదశ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయనేది వైసీపీ ఆరోపణ. దీనికి సంబంధించి సీఐడీ విచారణ జరుపుతోంది. అప్పట్లో టెండర్లను ఖరారుచేసే కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను, ఇన్ క్యాప్ మాజీ ఎండీ కే సాంబశివరావులను సీఐడీ విచారించింది. వారిని ఇంకా దఫదఫాలుగా విచారించనుంది.

విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయంలో గడిపిన అనంతరం వారు బయటకు వచ్చి.. ఆరోపణలన్నీ నిరాధారాలన్నీ, ఆ విషయాన్నే సీఐడీకి కూడా చెబుతామని అన్నారు.

అయితే ఈ హైటెక్ బాగోతంలో అసలు పాత్ర నారా లోకేష్ దేననే ప్రచారం ఉంది. లోకేష్ కు సంబంధం లేకపోయినప్పటికీ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల మీద ఆయన సంతకం పెట్టేసి.. పనిని ముందుకు నడిపించారని, చంద్రబాబునాయుడు కు కూడా తెలియకుండానే.. లోకేష్ సంతకాల ద్వారా వ్యవహారం ముందుకు నడిచిందని గతంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. లోకేష్ సంతకం చేసిన డాక్యుమెంట్ సహా వైసీపీ నాయకులు మీడియాకు లీక్ చేయడంతో గందరగోళం ఏర్పడింది.

అయితే ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న వారంతా చిన్న చేపలేనని.. లోకేష్ పాత్ర గురించి ఖచ్చితమైన ఆధారాలు వారినుంచి రాబట్టే దిశగానే.. ఇప్పుడు విచారణ సాగుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడిన ఆరోపణలు తేలితే గనుక.. లోకేష్ ను కటకటాల వెనక్కి పంపడానికి కూడా సీఐడీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Share post:

Popular