మామకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. అల్లుడికైనా హిట్ ఇస్తాడా..!

September 14, 2021 at 4:36 pm

కోలీవుడ్లో విష్ణువర్ధన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. తమిళ బిల్లాను తెరకెక్కించింది విష్ణువర్ధనే. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా పంజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని విష్ణువర్ధన్ స్టైలిష్ గా చూపించాడు.

ఈ సినిమాలోనే మొదటిసారిగా పవన్ కళ్యాణ్ బియర్డ్ లుక్ తో కనిపించాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ విష్ణువర్ధన్ కి అవకాశాలు దక్కలేదు. సుమారు 12 ఏళ్ల తర్వాత విష్ణువర్ధన్ కు మరో తెలుగు సినిమా చేసే ఛాన్స్ దక్కినట్లు సమాచారం. విష్ణువర్ధన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన షేర్షా మూవీ ఇటీవల బాలీవుడ్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా హిట్ కావడంతో విష్ణువర్ధన్ కు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. ఆయనతో తెలుగులో ఓ సినిమా చేసేందుకు కొద్ది రోజుల కిందట ఓ నిర్మాత అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ నిర్మాత వైష్ణవ్ తేజ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉప్పెన మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే తమిళ అర్జున్ రెడ్డి డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత విష్ణువర్ధన్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సినిమా చేసే అవకాశం ఉంది. విష్ణువర్ధన్ తెలుగులో తన తొలి సినిమానే మెగా ఫ్యామిలీ లో అగ్ర హీరో అయిన పవన్ కళ్యాణ్ తో చేసినా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇప్పుడు విష్ణువర్ధన్ మరోసారి మెగా ఫ్యామిలీ హీరో ద్వారానే తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈసారైనా విష్ణువర్ధన్ విజయం అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

మామకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. అల్లుడికైనా హిట్ ఇస్తాడా..!
0 votes, 0.00 avg. rating (0% score)