పెరుగుతున్న కేసులు.. కోర్టుల చుట్టూ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వేల మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా కోర్టుకు వెళుతున్న వారు రోజుకు దాదాపు 450 మంది ఉంటున్నారట. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించిన కేసులు దాదాపు లక్షా 94వేల కేసులు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. 8 వేల కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా అది కూడా చేయలేదని తెలుస్తోంది.

ఈ కేసుల వల్ల రోజూ ప్రభుత్వ అధికారులు సీఎస్ తో సహా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రోజూ డ్యూటీకి వచ్చినట్లు కోర్టుకు వెళుతున్నారు. రోజుకు 40వేల పేజీల పిటీషన్లు కోర్టుల్లో ఫైల్ అవుతున్నాయంటే ఏపీ సర్కారు పై ప్రజలకు ఎంత అసహనముందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బాధపడుతున్న వారు, ఇబ్బందులకు గురవుతున్న వారు కోర్టుకు వెళుతున్నారు. గతంలో కంటే ఇది 30 శాతం పెరిగింది. ఈ కేసుల్లో పరిపాలన, పబ్లిక్ పాలసీకి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కేసులకు సంబంధించి రాష్ట్రంలో విధానమంటూ లేకపోవడం, ఫాలో అప్ చేసే వ్యవస్థ లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు కంటెప్ట్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు ఐఏఎస్ అధికారులే ఉంటున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ బిల్లుల చెల్లింపు వ్యవహారాల్లో అధికారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇలా లక్షల్లో కోర్టు కేసులుండటం, రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.

Share post:

Latest